బీఆర్ఎస్‌కు ఎంప్లాయీస్ టెన్షన్!

ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ‘టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూకు ఉపాధ్యాయులు షాక్ ఇచ్చారు.

Update: 2023-03-18 01:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ‘టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూకు ఉపాధ్యాయులు షాక్ ఇచ్చారు. ప్రభుత్వంపై ఉపాధ్యాయుల్లో ఉన్న వ్యతిరేకతను చాటేలా తీర్పు ఇచ్చారు. బీజేపీ బలపర్చిన ఏవీఎన్ రెడ్డిని గెలిపించారు. అయితే ఈ తీర్పు ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూడు ఉమ్మడి జిల్లాల్లో పడుతుందని బీఆర్ఎస్ భావిస్తున్నది. ఎఫెక్ట్ పడకుండా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే ఎమ్మెల్సీ ఫలితాలపై సీఎం కేసీఆర్ పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిసింది.

అధికారికంగా మద్దతివ్వకపోయినా..

టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో బీఆర్ఎస్ అధికారంగా ఎవరికి మద్దతివ్వలేదు. అయితే పీఆర్టీయూ అంటేనే అనుబంధ సంస్థగా ముద్రపడింది. గతంలో పీఆర్టీయూకు మద్దతు ప్రకటించేంది. మునుగోడు బైపోల్‌తో వామపక్షాలతో జత కలవడంతో ఈ సారి బహిరంగంగా మద్దతు పలకలేదు. అయినప్పటికీ పీఆర్టీయూ నేతలు ఎన్నికల ప్రచారంలో కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలతో పాల్గొన్నారు. కొంతమంది ఉపాధ్యాయ సంఘం నేతలు గులాబీ కండువాతోనూ తిరిగారు. అయినా పీఆర్టీయూ అభ్యర్థి చెన్నకేశవరెడ్డికి ఉపాధ్యాయులు మొండిచెయి చూపారు. బీజేపీ బలపర్చిన ఏవీఎన్ రెడ్డిని గెలిపించారు. మూడు జిల్లాల్లో బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం తపస్‌కు సభ్యులు లేకున్నా విజయం సాధించడంతో గులాబీ బాస్ స్పీడ్‌కు బ్రేక్ పడినట్లయింది.

టీచర్లలో తీవ్ర వ్యతిరేకత

ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రిజల్ట్స్ ద్వారా ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనే సంకేతమిచ్చారు. 317 జీవోతో ఉపాధ్యాయులంతా గతంలో రోడ్డెక్కారు. మూడు డీఏలు, పీఆర్సీ ఏరియర్స్ పెండింగ్, మెడికల్ బిల్లులు, జీపీఎఫ్ నిధులు, 2015 నుంచి బదిలీలు, పదోన్నతులు పెండింగ్, పండితులు, పీఈటీలకు 22 ఏళ్లుగా పదోన్నతులు లేకపోవడం, పాత పెన్షన్ పునరుద్ధరించాలని నిరసనలు వ్యక్తం చేసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ప్రభుత్వానికి నిరసనను తెలియజేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టారన్నది స్పష్టంగా తెలుస్తున్నది. ఈ విజయం రాబోయే ఎన్నికల్లో సైతం ప్రభావం చూపే అవకాశం ఉన్నది.

ఆరా తీసిన సీఎం కేసీఆర్

బీజేపీ బలపర్చిన ఏవీన్ రెడ్డి విజయం ఎలా సాధించారు? విజయం కోసం దోహదపడిన అంశాలు ఏవి? ప్రభుత్వంపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉన్నది? అనే అంశాలపై సీఎం కేసీఆర్ ఆరా తీసినట్టు తెలిసింది. గత ఎన్నికల్లో కూడా ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత ఉండటంతో ఉద్యోగులు, సిబ్బందికి ఎన్నికల డ్యూటీ వేశారు. అయితే ఈసారి అన్నిశాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో పీఆర్సీ అమలుకు నోచకపోవడంతో ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. అయితే వీరే వచ్చే ఎన్నికల్లో విధులు నిర్వహించే అవకాశం ఉండటంతో గులాబీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఉద్యోగ, ఉపాధ్యాయులు చెబితే ప్రజలు మాట వింటారనే టాక్ ఉన్నది.

ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేసిన ఏ ప్రభుత్వం కూడా మనుగడసాగించలేదని స్పష్టంగా తెలుస్తున్నది. ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రజలను చైతన్యం చేసి బీఆర్ఎస్‌కు ఓటువేయవద్దని కోరితే అధికారపార్టీకి తీవ్ర నష్టం జరిగే ప్రమాదమున్నది. గెలుపోటములను ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రభావం చేసే అవకాశం ఉంది. దీంతో కేసీఆర్ తోపాటు పార్టీ నేతలకు ఎంప్లాయీస్ టెన్షన్ పట్టుకున్నది. నిర్లక్ష్యం చేస్తే రాబోయే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే ఆందోళన వారిలో కనిపిస్తున్నది.

కలిసి రాని ప్రభుత్వ నిర్ణయం

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నోటీఫికేషన్ వస్తుందనే కారణంతో ఈ ఏడాది జనవరి మూడోవారంలో బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్ రావడం, ఇతర కారణాలతో అమలుకు నోచలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులను సంతృప్తి పరిచి లబ్దిపొందాలని భావించినప్పటికీ నిరాశే ఎదురైంది. ఎవరుకూడా ప్రభుత్వం మాటలు నమ్మే పరిస్థితి లేకుండాపోయిందని ఈ ఎమ్మెల్సీ ఫలితాలు స్పష్టం చేశాయి. కేసీఆర్ ఎన్నికలు వచ్చినప్పుడు పదేపదే ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని పేర్కొంటున్నప్పటికీ, ఆచరణలో కార్యరూపం దాల్చకపోవడంతో ఉద్యోగులంతా గుర్రుగా ఉన్నారు.

Tags:    

Similar News