బిగ్ న్యూస్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఊహించని పరిణామం.. MLC కవిత వ్యూహానికి ఈడీ స్ట్రాంగ్ కౌంటర్..!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ ఎంక్వయిరీకి హాజరుకాకుండా రిలీఫ్ పొందాలని కల్వకుంట్ల కవిత చేస్తున్న ప్రయత్నాలకు ఈడీ ఊహించని షాక్ ఇచ్చింది.

Update: 2023-03-19 02:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ ఎంక్వయిరీకి హాజరుకాకుండా రిలీఫ్ పొందాలని కల్వకుంట్ల కవిత చేస్తున్న ప్రయత్నాలకు ఈడీ ఊహించని షాక్ ఇచ్చింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై ఎలాంటి ముందస్తు ఆదేశాలు వెలువరించకుండా ఈడీ కెవియట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ నెల 24న ఆమె పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించే సమయంలో ఈడీ తరఫున వాదనలు వినడం అనివార్యంగా మారింది. తమ వాదనలు వినకుండా కవిత పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వవద్దని ఆ పిటిషన్‌లో కోరింది.

కవిత పిటిషన్‌పై జరిగే విచారణలో ఈడీ అభిప్రాయాన్ని తీసుకోవడం కూడా తప్పనిసరిగా మారింది. ఈడీ విచారణ నుంచి మినహాయింపు కోసం వెళ్లిన కవితకు ఈడీ ద్వారా కెవియట్ రూపంలో ఊహించని పరిణామం ఎదురైంది. ఒక మహిళగా తనను ఈడీ ఆఫీసులో విచారించడాన్ని సవాలు చేస్తూ ఇంట్లోనే ఎంక్వయిరీ చేయాల్సిందిగా ఈ నెల 14న సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 24న విచారణ చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు సీజే ధర్మాసనం స్పష్టం చేసింది. దీన్ని సాకుగా చూపిన ఆమె.. ఈ నెల 16న ఈడీ ఎంక్వయిరీకి గైర్హాజరయ్యారు.

న్యాయవాది ద్వారా సమాచారాన్ని పంపారు. ఈ పిటిషన్‌ను లెక్కలోకి తీసుకోని ఈడీ.. ఈ నెల 20న విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీచేసింది. సుప్రీంకోర్టులోని పిటిషన్ ఇంకా అడ్మిట్ అయ్యి విచారణకు రాని నేపథ్యంలో దాన్ని సబ్ జ్యుడిషియస్ మేటర్‌గా పరిగణించలేమని ఈడీ స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నది. ఆ కారణంగానే 20న హాజరుకావాలని కవితకు నోటీసులు జారీచేశారు. కానీ కవిత.. ఈడీకి రాసిన లేఖలో మాత్రం ఈ నెల 24న సుప్రీంకోర్టులో తన పిటిషన్‌పై విచారణ జరగనున్నందున అప్పటివరకూ ఎంక్వయిరీకి హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

కానీ దీన్ని ఈడీ అధికారులు లెక్కలోకి తీసుకోలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కవిత మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించి ఈ నెల 24న జరగాల్సిన విచారణను తొందరగానే చేపట్టాలని స్పెషల్ మెన్షన్ కింద విజ్ఞప్తి చేశారు. అయినా సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించలేదు. ఎలాగూ 24న విచారణ చేపట్టనున్నట్టు ముందుగానే స్పష్టం చేసినందున ఆ ప్రకారమే హియరింగ్ ఉంటుందని స్పష్టత ఇచ్చింది. దీంతో ఈడీ ఇచ్చిన నోటీసు ప్రకారం ఈ నెల 20న విచారణకు హాజరు కావడం కవితకు తప్పనిసరి అయింది.

ఈడీ ఎంక్వయిరీ నుంచి తప్పించుకోడానికి కవిత సుప్రీంకోర్టు ద్వారా లీగల్ బ్యాటిల్ మొదలుపెడితే ఈడీ సైతం అదే న్యాయస్థానం ద్వారా మరో రూపంలో గేమ్ ఆడే వ్యూహాన్ని ఎంచుకున్నది. ఈడీ వాదనలతో సంబంధం లేకుండా సుప్రీంకోర్టు ద్వారా రిలీఫ్ పొందాలనుకున్న కవితకు.. కెవియట్ పిటిషన్ రూపంలో ఊహించని షాక్ తగిలింది. ఆమె పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈడీ కూడా తన వాదనలను వినిపించడం అనివార్యమైంది. ఎలాగూ ఎంక్వయిరీకి రావాల్సిందేనని ఈడీ పట్టుబడుతున్నందున కవిత పిటిషన్‌పై విచారణ జరిగే సమయంలో ఆ దర్యాప్తు సంస్థ తరఫున న్యాయవాది ఆ తరహా వాదనలనే లేవనెత్తుతారు. ఈడీ అభిప్రాయాలను, వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువరించడానికి వీలు లేకుండాపోయింది. ఇరు తరఫున వాడీవేడిగా వాదనలు జరగడానికి ఆస్కారం ఏర్పడింది.

ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై గంపెడాశలు పెట్టుకున్నా.. ఈడీ తనదైన శైలిలో వ్యూహాత్మకంగా వ్యవహరించి కెవియట్ పిటిషన్ దాఖలు చేసింది. కేసు విచారణ సందర్భంగా వాయిదాలు కోరితే దానికి అనుగుణంగా కవితకు లభించాల్సిన రిలీఫ్ కూడా వాయిదా పడుతూనే ఉంటుంది. కవితకు ఉపశమనం లభించకుండా ఈడీ విచారణ వాయిదాలను కోరే వ్యూహాన్నీ ఇకపైన అమలు చేసే చాన్స్ లేకపోలేదు. అప్పటివరకూ ఈడీ ఎంక్వయిరీలకు సుప్రీంకోర్టు ద్వారా ఆంక్షలు ఎదురయ్యే అవకాశం లేదు.

ఈడీ వేసిన కెవియట్‌ విషయంలో కవిత ఎలాంటి వ్యూహాన్ని అవలంబిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ మద్యం కుంభకోణం దర్యాప్తులో కవితకు నోటీసులు జారీ చేసేంతవరకూ ఈడీ అధికారులకు నిందితులు, అనుమానితుల నుంచి ఎంక్వయిరీ విషయంలో ఎలాంటి చిక్కులు ఎదురుకాలేదు. కవితకు ఫస్ట్ టైమ్ నోటీసు జారీచేయడంతోనే తొలుత తేదీని మార్చాలనే రిక్వెస్టు పెట్టింది. రెండోసారి నోటీసు ప్రకారం విచారణకు వచ్చే సమయానికి సుప్రీంకోర్టు పిటిషన్ అంశాన్ని సాకుగా చూపి హాజరుకావడం నుంచి మినహాయింపు పొందారు. మూడోసారి (ఈ నెల 20న) విచారణకు వచ్చే సమయానికి ఆమె ఇంకా ఎలాంటి ప్లాన్ వేస్తారోననే అనుమానంతో ఉన్న ఈడీ.. ఆమెకు అవకాశం ఇవ్వకుండా కెవియట్ బాటను ఎంచుకున్నది.

కీలకంగా కవిత నిర్ణయం

ఈ నెల 24న కవితను విచారించడానికి ఈడీకి ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో ఆమె తీసుకునే నిర్ణయమే కీలకంగా మారింది. నోటీసును గౌరవిస్తూ ఈడీ ఆఫీసుకు ఎంక్వయిరీకి వెళ్తారా? లేక ఇతర కారణాలను చూపి మళ్లీ గైర్హాజరవుతారా? అనేది ఆసక్తి రేకెత్తిస్తున్నది. గత విచారణ సందర్భంగా అనారోగ్యాన్ని సాకుగా చూపారనే వార్తలు వచ్చినా.. ఈడీకి రాసిన లేఖలో కవిత అలాంటి ప్రస్తావన చేయలేదు. న్యాయవాది కూడా అనారోగ్యం లాంటి కారణమేదీ లేదనే విషయాన్ని నొక్కిచెప్పారు. ఈ నెల 20న జరిగే విచారణ సందర్భంగా ఎలాంటి కారణం కవితవైపు నుంచి తెరపైకి వస్తుందనే ఉత్కంఠ మొదలైంది.

ఒకవేళ కవిత గైర్హాజరైతే ఈడీ ఎలా రియాక్ట్ అవుతుందనేది కూడా హాట్ టాపిక్‌గా మారింది. కవిత వర్సెస్ ఈడీగా మారిన ఈ లీగల్ గేమ్‌ రోజుకో మలుపు తిరుగుతున్నది. కవిత తరఫున న్యాయవాది వందనా సెహగల్ పిటిషన్ దాఖలు చేయగా ఈడీ తరఫున ముఖేష్ కుమార్ మరోరియా కెవియట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. కవిత పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా, ఆదేశాలు జారీ చేయాలనుకున్నా ఈడీ అభిప్రాయాన్ని తెలుసుకోవడం ఒక షరతుగా మారింది.

ఇవి కూడా చదవండి : BRS నేతలకు కొత్త తలనొప్పి.. ఆ విషయంలో ఏం మాట్లాడాలో తెలియక అయోమయం!  

Tags:    

Similar News