తెలంగాణ ఎన్నికలపై ఈసీ కసరత్తు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కసరత్తు ప్రారంభించింది. ఎన్నికలపై ముగ్గురు సీనియర్ అధికారుల బృందం శనివారం సమీక్ష నిర్వహించింది.

Update: 2023-04-15 12:34 GMT
తెలంగాణ ఎన్నికలపై ఈసీ కసరత్తు ప్రారంభం
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఢిల్లీ నుంచి శనివారం ముగ్గురు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు హైదరాబాద్‌కు వచ్చారు. డిప్యూటీ కమిషనర్ నితీష్ వ్యాస్ నేతృత్వంలో వచ్చిన బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్, అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఈవీఎంల సన్నద్ధత, ఇతర అంశాలపై సమీక్షించారు. ఓటర్ల జాబితాలో చేర్పులను నిరంతరం పర్యవేక్షించాలని, ఆర్వోలు మే 1 నుంచి ఈవీఎంలను తనిఖీ చేయాలని ఈసీ ఆదేశించింది. జిల్లా స్థాయి ఎన్నికల అధికారులకు రెండ్రోజుల పాటు వర్క్ షాప్ నిర్వహించాలని సూచించారు.

పోల్ శాతాన్ని పెంచడానికి కార్యకలాపాలు పెంచాలని, రాష్ట్రవ్యాప్తంగా రిటర్నింగ్‌ అధికారుల (ఆర్‌ఓ) సమగ్ర జాబితాను సిద్ధం చేసి అప్‌డేట్ చేయాలన్నారు. జూన్ 1 నుండి ఈవీఎంలను మొదటి స్థాయి తనిఖీని ప్రారంభించాలని సూచించారు. ఈ సమావేశంలో భారత ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్, ఈసీఐ అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, జాయింట్ సీఈవో రవికిరణ్, డిప్యూటీ సీఈవో సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులతో డీజీపీ అంజనీ కుమార్ శుక్రవారం సమీక్షా నిర్వహించారు. ఈ మీటింగ్ జరిగిన మరుసటి రోజే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటించడం రాజకీయంగా ఆసక్తిగా మారింది.

Read more:

 కీలక దశకు చేరుకున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విచారణ...సీఎం కేసీఆర్ కోసం కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్!...రంగంలోకి బిహార్ సీఎం.. కేజ్రీవాల్ దారెటు?

Tags:    

Similar News