T-Hub : బీసీలు, వెనకబడ్డ వారు కాదు.. వెనక పడేయబడ్డవారు! ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు
వీళ్లు బీసీలు, వెనకబడ్డ వారు అంటే కొంత బాధేస్తుందని ఎంపీ ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: వీళ్లు బీసీలు, వెనకబడ్డ వారు అంటే కొంత బాధేస్తుందని ఎంపీ ఈటల రాజేందర్ Eatala Rajendar ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీలు అంటే వెనక పడ్డవారు కాదు వెనక పడేయబడ్డవారని అన్నారు. మన ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టి వీరు చిన్నవారు, వెనకబడ్డ వారు, వేరే వారి సపోర్ట్ ఉంటే తప్ప ముందుకు పోరు అనే భావన మంచిది కాదన్నారు. ఇవాళ టీ హబ‌్‌లో జరిగిన BICCI ( Backward Classes Chambers of Commerce and Industry) కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. పారిశ్రామిక విప్లవం మొదలు కాకముందు మానవజాతికి అన్ని సౌకర్యాలు అందించింది ఈ వర్గాల ప్రజలే అని మనం అంటున్నామని అన్నారు. వృత్తుల వారీగా కులాలు ఏర్పడ్డాయి తప్ప మేధస్సు, సంపద వారీగా కులాలు ఏర్పడలేదని వివరించారు.
నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకున్నవాడినే
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్న ఈ రోజుల్లో అనేక రకాల శాస్త్ర విజ్ఞాన ఆవిష్కరణలు జరుగుతున్నాయని తెలిపారు. పేదరికం ఎదుగుదలకు శాపం కాదని, తెలివి ఎవరి సొత్తు కాదన్నారు. తెలివి కులాల బట్టి రాదని, నేను హైదరాబాదులో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకున్నవాడిని.. అని చెప్పుకొచ్చారు. విశ్వకర్మ, నేత కార్మికులు అనేక రంగాల్లో ఉండే వారి మేధస్సు చూస్తుంటే అబ్బుర పరుస్తాయన్నారు. సంఘం తప్పకుండా ఉండాలని, సంఘంలో ఎదిగిన వారు, మేధస్సు కలిగిన వారు, అందరూ కలగలిపి ముందుకు పోయే పద్ధతి ఉండాలి తప్ప పేదరికం కోసం సంఘం ఉన్నట్లు నేను భావించడం లేదని అన్నారు. బీఐసీసీఐ ఎంత గొప్పగా ప్రయత్నం చేసిందో తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో వెళ్ళేదన్నారు. ఇది ఇలానే ముందుకు పోవాలని ఆశించారు.టెక్నాలజీ అనేది మనిషి యొక్క శ్రమను, టెన్షన్ తగ్గించి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అనుకున్నాం కానీ మనిషికి పని లేకుండా చేస్తుందని అనుకోలేదన్నారు. మనిషిని రీప్లేస్ చేసే టెక్నాలజీ మంచిది కాదని అన్నారు. ప్రపంచంలో మానవ శక్తి కలిగినటువంటి మొదటి దేశం భారత్ అని, మనిషిని సంపదగా భావించిన సమాజం ఇప్పుడు ఎందుకు భారంగా భావిస్తుందో ఆలోచన చేసుకోవాలన్నారు.
తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు జూపల్లి కృష్ణారావు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్‌గా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. రామానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి మినిస్టర్ బదులుగా తానే వెళ్లానని చెప్పారు. మొట్టమొదటిసారిగా గుడిసెల్లో ఉండే పేదవారు చదువుకుంటున్నారు.. వారు బయటకు వచ్చిన తర్వాత వాళ్లకు ఇంగ్లీష్ సరిగా ఉండదు, రంగు రూపు సక్కగా లేకపోవచ్చు కానీ అవకాశం వస్తే గొప్పగా పనిచేసే సత్తా ఉన్నవాళ్లు.. ఆ జనరేషన్ కి ఉద్యోగాలు లేని పరిస్థితి వచ్చిందని నేనే దాన్ని మొత్తం స్టడీ చేసి వెంటనే 15 కోట్ల రూపాయలు ఇచ్చి.. ఇలాంటి ఇన్స్టిట్యూట్ 600 మంది కాదు 2000 మందికి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయండి అని చెప్పాను.. అని వివరించారు. అమ్మానాన్న ఆశయాలను ఎలా నెరవేర్చాలి అనే దానితో ముందుకు వెళ్లాలని, ఓటమి గెలుపునకు మరో మెట్టు అవుతుందని మర్చిపోకండని, పేదరికం మీ కమిట్మెంట్‌కు ఒక మెట్టు లాగా పని చేయాలని భావిస్తున్నానని యువతకు పిలుపునిచ్చారు.