మై హోం పైకి బుల్డోజర్లు పంపే దమ్ముందా..? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మై హోం గ్రూప్‌‌నకు బీఆర్‌ఎస్‌ హయాంలో సెంట్రల్‌ యూనివర్సిటీ భూములు అప్పగించారనే ఆరోపణ మిలీనియం జోక్‌ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

Update: 2025-04-02 16:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మై హోం గ్రూప్‌‌నకు బీఆర్‌ఎస్‌ హయాంలో సెంట్రల్‌ యూనివర్సిటీ భూములు అప్పగించారనే ఆరోపణ మిలీనియం జోక్‌ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలు నిజమే అయితే మై హోం గ్రూప్‌‌ పైకి బుల్డోజర్లు పంపే దమ్ము సీఎం రేవంత్‌రెడ్డికి ఉన్నదా అని సవాల్ విసిరారు. మై హోం గ్రూప్‌ చైర్మన్‌ బీజేపీతో ఉన్నారని.. ఆయన ప్రధాని పక్కన కూర్చుంటారని.. అలాంటి పెద్ద వ్యక్తి మీదికి హైడ్రా బుల్డోజర్లు పంపాలని చాలెంజ్‌ చేశారు. పేదల ఇండ్లపైకి, మూగజీవాలపైకి పంపే బుల్డోజర్లు పెద్దలపైకి ఎందుకు పంపడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. ఆ భూముల పరిరక్షణ కోసం కేసీఆర్ నిర్దేశం మేరకు న్యాయవాదులు కోర్టులో గట్టిగా వాదనలు వినిపించారని గుర్తు చేశారు.

కోల్డ్ స్టోరేజీకి బీసీ బిల్లు పంపే కుట్ర

అసెంబ్లీ ఆమోదించిన బీసీ బిల్లును కోల్డ్ స్టోరేజీకి పంపేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు పకడ్బందీ స్క్రీన్ ప్లే రచించిందని కవిత మండిపడ్డారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్‌ చేసిన తీర్మానాలను తెరమరుగు చేయడమే ప్రభుత్వ ప్రయత్నమన్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని కాపాడేందుకే సీఎం డైవర్షన్‌ డ్రామాకు తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తానని అసెంబ్లీ, కౌన్సిల్‌ సాక్షిగా హామీ ఇచ్చిన రేవంత్‌‌రెడ్డి.. ఢిల్లీలో బుధవారం బీసీ సంఘాలు నిర్వహించిన సమావేశానికి హాజరై అఖిలపక్షం అంశాన్ని డైవర్ట్‌ చేశారని ఆరోపించారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తే తనకు అండగా నిలుస్తున్న బీజేపీ సర్కారు ఇరుకున పడుతుందనే భయమన్నారు. అఖిలపక్ష నాయకులు రిజర్వేషన్ల పెంపుపై కేంద్రాన్ని నిలదీస్తే కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని.. ఆ పార్టీకి రాజకీయంగా ఇబ్బంది కలగకూడదనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లే అంశాన్ని పక్కకు పెట్టాని తెలిపారు. రేవంత్‌‌రెడ్డి చేస్తున్న డైవర్షన్‌ పాలిటిక్స్‌‌ను తెలంగాణ సమాజం, బీసీలు గమనిస్తూనే ఉన్నారని హెచ్చరించారు.

ఖర్గే, రాహుల్ ఎందుకు హాజరుకాలేదు?

తెలంగాణ ప్రజల ఓట్లే తప్ప ఇక్కడి వాళ్ల పాట్లు తమకు పట్టవని కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం పదేపదే నిరూపించుకుంటూనే ఉన్నదని కవిత విమర్శించారు. బీసీ సంఘాలు సమావేశమైన జంతర్‌ మంతర్‌‌కు కూతవేటు దూరంలోనే మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ ఉన్నా సమావేశానికి రాలేదని.. ఇది బీసీలను అవమానించడమేనన్నారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన పార్టీకి ఇక్కడి ప్రజల ఆకాంక్షలు, మనోభావాలతో పని లేదా అని ప్రశ్నించారు. రేవంత్‌ సర్కార్‌ సాగిస్తున్న ఏ ఒక్క దమనకాండపై రాహుల్‌ గాంధీ ఇప్పటి వరకు నోరు విప్పలేదన్నారు. లగచర్ల రైతుల మీద, బంజారా మహిళలపై సర్కారు అర్ధరాత్రి కరెంట్‌ తీసి అఘాయిత్యాలకు పాల్పడినా మాట్లాడలేదన్నారు. మూసీ ప్రాజెక్టు పేరిట పేద ప్రజల ఇళ్లను కూలగొట్టినా స్పందించలేదని గుర్తు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝులిపించినా రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకునే ప్రధాన ప్రతిపక్ష నేత ఎందుకు ఖండించలేదో చెప్పాలన్నారు. రాహుల్‌గాంధీకి తెలంగాణతో పేగుబంధం లేదని, ఉన్నది ఎన్నికల బంధం మాత్రమేనని అన్నారు. ఎప్పటికైనా తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని స్పష్టం అయ్యిందన్నారు.

ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నారని, ఆయన దుశ్చర్య వల్ల హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని కవిత మండిపడ్డారు. అందుకే 400 ఎకరాలు విక్రయించి సర్కారును నడపాలని నిర్ణయానికి వచ్చారని ఆరోపించారు. యూనివర్సిటీ నుంచి తీసుకున్న భూమిని యూనివర్సిటీకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. 397 ఎకరాలను మరోచోట యూనివర్సిటీకి ఇచ్చామని ప్రభుత్వం వితండవాదం చేస్తున్నదని, ఆ భూముల్లోనే పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. ఇప్పటికే కాంక్రీట్ జంగిల్‌లా మారిన గచ్చిబౌలి ప్రాంతంలోని ఈ 400 ఎకరాల్లోనూ కంపెనీలు ఏర్పాటైతే వాతావరణం మరింత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Similar News