‘ఆ కాలేజీల ప్రవేశాల్లో జోక్యం వద్దు!’
దోస్త్ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ ప్రైవేటు డిగ్రీ కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్లపై శనివారం హైకోర్టులో విచారణ జరిగింది.
దిశ, డైనమిక్ బ్యూరో: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రభుత్వం విడుదల చేసిన దోస్త్ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ ప్రైవేటు డిగ్రీ కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్లపై శనివారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్లు వేసిన కాలేజీల ప్రవేశాల్లో జోక్యం చేసుకోవద్దని ఈ సందర్భంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి, ఉన్నత విద్యామండలి, వర్సిటీలకు ఆదేశించింది. అలాగే పెండింగ్‌లో ఉన్న పిటిషన్ల జాబితా ఇవ్వాలని ఉన్నత విద్యా మండలిని ఆదేశించింది. డిగ్రీలో చేరేందుకు దోస్త్ ఆన్‌లైన్ ప్రవేశాలను సవాల్ చేస్తూ 40 ప్రైవేటు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఉన్నత విద్యామండలి ఒకే విధంగా నోటిఫికేషన్లు ఇస్తోందని, 2016-17 నుంచి ఇదే తరహాలో నోటిఫికేషన్లు ఇస్తోందని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ఆరోపించాయి. ఇలా చేయడం వల్ల ఏటా మధ్యంతర ఉత్తర్వులతోనే ప్రవేశాలు చేపడుతున్నామని, అభ్యంతరాలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని యాజమాన్యాలు కోర్టు దృష్టికి తీసుకువచ్చాయి. దోస్త్‌తో సంబంధం లేకుండా ప్రవేశాలకు అనుమతించాలని విజ్ఞప్తి చేశాయి. వాదనలు విన్న న్యాయస్థానంపై ప్రభుత్వానికి నోటీసులు ఇస్తూ తదుపరి విచారణను జూన్ 15కు వాయిదా వేసింది.
Also Read..