భూ సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గం.. రెవెన్యూ ట్రిబ్యునల్స్
గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన ‘ధరణి’ పోర్టల్ లక్షలాది మంది రైతుల జీవితాలకు ‘ఆటో లాక్’ వేసేసింది.
గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన ‘ధరణి’ పోర్టల్ లక్షలాది మంది రైతుల జీవితాలకు ‘ఆటో లాక్’ వేసేసింది. అవును.. నిజం. తరతరాలుగా వచ్చిన భూములపై హక్కులను ప్రశ్నార్థకం చేశారు. చేతిలో పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నాయి. క్షేత్రంలో వాళ్లే దున్నుకుంటున్నారు. తాతముత్తాతల కాలం నుంచి వాళ్లే హక్కుదారులు.. కానీ కొత్తగా వచ్చిన ధరణి మీ భూములు మీవి కావంటున్నాయి. అట్లెట్టా? అంటే సమాధానమిచ్చే రెవెన్యూ యంత్రాంగమేదీ కనిపించడం లేదు. కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేయలేదు. కనీసం కోర్టుకు వెళ్లాలన్నా ఏ అంశం ఆధారంగా వెళ్లాలో అంతుచిక్కని దైన్యం.. ప్రభుత్వ భూములు, దేవాదాయ, వక్ఫ్ భూములను కాపాడుతామని, వాటిని ఆటో లాక్ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో సభ్యులకు ప్రకటించారు. ఆ తర్వాత వెంట వెంటనే జీవోల ద్వారా అమలు చేశారు. ఐతే కొత్తగా రెండు విభాగాలు సమర్పించిన జాబితాలన్నింటినీ ‘ధరణి’ పోర్టల్‌లో ఆటోలాక్ చేశారు. వాటిపై క్రయ విక్రయాలు జరగకుండా నిషేధించారు. అలాగే భవన నిర్మాణాలకు అనుమతులను నిరాకరించేందుకు ఏర్పాట్లు చేశారు.
నిజమైన హక్కు దారులను కూడా వాటిలో చేర్చడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ఏ అధికారి వారి గోడును వినిపించుకోవడం లేదు. ఏ కార్యాలయం నుంచి వారికి భరోసా లభించడం లేదు. వివిధ అభివృద్ధి పనుల కోసం సేకరించిన భూములపైనా వివాదాలు కొనసాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో నీటి వనరుల ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములు నేటికీ పట్టాదారుల పేరిటే కొనసాగుతున్నాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో ఎకరం సేకరిస్తే వారి సర్వే నంబరులోని పూర్తి భూమిని నిషేదిత జాబితాలో చేర్చారు. ఓ వైపు ప్రభుత్వానికి నష్టం కలిగించారు. మరో వైపు వేలాది మంది హక్కుల కాలరాజేస్తున్నారు. అవసరాలకు ఆ భూములను అమ్ముకోవాలనుకుంటే ధరణి పోర్టల్ అడ్డొస్తుంది. ఎన్నేండ్లకు తమ సమస్యలను పరిష్కరిస్తారోనని ఆశతో తహశీల్దార్ కార్యాలయాల ముందు పడిగాపులు కాస్తున్నారు. భూములను కాపాడేందుకు వేసిన ఆటో లాక్ తమ జీవితాలకు వేసినట్లయిందంటున్నారు.
ఐతే అప్పట్లో పార్టు బి కింద పెట్టిన 18.50 లక్షల ఎకరాలపై నేటికీ పేచీ నడుస్తున్నది. ఇలాంటి అనేక భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటే పరిష్కార మార్గమని భూ చట్టాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెవెన్యూ రికార్డులు, ఇనాం, జాగీర్, పీఓటీ, టెనెన్సీ, ఎండోమెంట్, భూదాన్, వక్ఫ్ భూ సమస్యలకు పరిష్కారం చూపడానికి రెవెన్యూ ట్రిబ్యునల్ మంచిదంటున్నారు. కొత్త ఆర్వోఆర్ 2024 తో పాటే ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు ప్రక్రియను మొదలు పెట్టాలని కొందరు నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. జైరాం రమేశ్వంటి దిగ్గజాలు కూడా అన్ని రాష్ట్రాల్లో భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ ట్రిబ్యునల్స్ అవసరమని సూచించారు. ఆఖరికి నీతి అయోగ్ వంటి సంస్థలు కూడా ప్రతిపాదించాయి. రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే జిల్లా, రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ ట్రిబ్యునళ్ల ఏర్పాటు జరుగుతుందని ఆశిద్దాం.
నాలుగేండ్లుగా అన్నీ బంద్
కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్నాం.. ఈ క్రమంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. రానున్న కొత్త రెవెన్యూ చట్టం ప్రకారమే అన్నీ పరిష్కరించాలి. అప్పటి వరకు ఎలాంటి భూ సంబంధ అంశాలపై ఆర్డర్లు జారీ చేయొద్దు.. అంటూ 2021 సెప్టెంబర్ 7న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి సీసీఎల్ఏ రిఫరెన్స్ నం.ఏఎస్ఎస్.1(1)/463/2020, తేదీ.7.9.2020 ఆదేశించారు. దీని ప్రకారం మళ్లీ ఆదేశాలు జారీ చేసే వరకు ల్యాండ్ మ్యాటర్స్ ముట్టుకోవద్దు. ఒకవేళ ఏదైనా ఆర్డర్ జారీ చేసినా చెల్లదు. ఈ ఆదేశాలను రెవెన్యూ శాఖలోని అధికారులందరికీ వర్తింపజేయాలని కలెక్టర్లకు సూచించారు. ఏదైనా ఈ ఉత్తర్వును ఉల్లంఘిస్తే సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనదంటూ చీఫ్ సెక్రటరీ, సీసీఎల్ఏ(ఎఫ్ఏసీ) సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు.
నాలుగేండ్లయ్యింది ఇప్పటివరకు జారీ చేసిన ఉత్తర్వులను ఇప్పటి వరకు పునఃసమీక్షించలేదు. దీని పర్యావసనం ఎంతో మందిని ఇక్కట్లకు గురి చేస్తున్నది. అప్పటి నుంచి ఆర్వోఆర్ మినహా అన్ని సమస్యలు పెండింగ్‌లో పడ్డాయి. ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్లు(ప్రస్తుత అదనపు కలెక్టర్లు) చేయదగ్గ, పరిష్కరించాల్సిన కేసులన్నీ మూలకు వేశారు. ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదు. కనీసం ఆ ఫైలు ముట్టుకోవడం లేదు. దీంతో వేల మంది తమ దరఖాస్తులను పరిష్కరించాలని అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. ‘తెలంగాణ భూముల హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల చట్టం 2020’ అమల్లోకి తీసుకొచ్చింది. ఆర్డీఓలు, అదనపు కలెక్టర్ల పరిధిలోని అంశాలకు, ఈ చట్టానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ సర్క్యూలర్ జారీ చేసి వివాదాలను అపరిష్కృతంగా మిగిల్చారు. ఇనాం, జాగీర్, పీఓటీ, టెనెన్సీ వంటి కేసుల్లో నిరభ్యంతర దృవీకరణ పత్రాలు, ఓఆర్సీలు ఇచ్చే ప్రక్రియకు బ్రేకులు వేశారు. ఐతే కొందరు పెద్దలకు మాత్రం ఓఆర్సీలు, ఎన్వోసీలు జారీ చేశారు.
బిహార్‌లో బెస్ట్ ప్రాక్టీస్..
బీహార్ రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ‘ది బీహార్ ల్యాండ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్ యాక్ట్,2009’, ‘బిహార్ ల్యాండ్ ట్రిబ్యునల్ యాక్ట్’లు తీసుకొచ్చాయి. వాటి ద్వారా లక్షల కేసులను పరిష్కరించారు. ఐతే కొందరు ఈ ట్రిబ్యునల్స్‌పై సుప్రీం కోర్టుకు వెళ్లారు. కానీ రెవెన్యూ చట్టల ఆధారంగానే తీర్పులు ఇస్తుండడం వల్ల కోర్టుల మీద కూడా భారం పడకుండా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు ఓ సీనియర్ అడ్వకేట్ తెలిపారు. అక్కడ వివాదాల పరిష్కారానికి యూనిఫామ్, కామన్ ఫోరమ్, ప్రొసీజర్, మెకానిజమ్ ఏర్పాటు చేశారు. వాటి ద్వారా ఎఫెక్టివ్ రిజల్ట్ కనబడుతుంది. అక్కడ సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ల్యాండ్ లా స్ పరిధిలోనే పరిష్కరిస్తున్నారు. ఆ తర్వాత అప్పీల్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అలాగే యూపీలోనూ బెస్ట్ ప్రాక్టీసెస్ నడుస్తున్నాయి. ఏ సమస్య ఎవరు చేయాలి? ఎంత కాలంలో చేయాలి? ఎలా అప్లై చేయాలి? ఇలా నిర్దిష్టమైన గైడ్ లైన్స్ తో ఆయా రాష్ట్రాల్లో ఫోరమ్స్ పని చేస్తున్నాయి. కిందిస్థాయిలో తీర్పులు ఇస్తే జిల్లా స్థాయి ట్రిబ్యునల్, ఆపై రాష్ట్రస్థాయి ట్రిబ్యునల్‌కి వెళ్తారు. అక్కడ కూడా నిర్దిష్ట కాల పరిమితిలోనే తీర్పులు వెలువరించే వ్యవస్థలు ఉన్నాయి.
జైరాం రమేష్ సిఫార్సులు..
యూపీఏ ప్రభుత్వంలో భూ సమస్యల పరిష్కారానికి మాజీ కేంద్ర మంత్రి జై రాం రమేష్ ల్యాండ్ మేనేజ్‌మెంట్‌పై కసరత్తు చేశారు. దాని ద్వారా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు పరిస్థితులను బట్టి ట్రిబ్యునల్స్‌ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అన్ని రకాల వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ ఫైనల్ అథారిటీ గా ఉండాలి. సివిల్ కోర్టులకు ఎలాంటి అధికారాలు ఉంటాయో అలాంటివే ట్రిబ్యునల్‌కి వర్తించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ట్రిబ్యునల్ ఏర్పాటుపై ప్రతిపాదనలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు పంపాలని సూచించారు. ఆఖరికి ఎస్టాబ్లిష్‌మెంట్, నిర్వహణకు అయ్యే ఖర్చుల్లో 50 శాతం భరించేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ఆర్టికల్ 323 బీ/ 11 ఏ ప్రకారం ఈ ల్యాండ్ ట్రిబ్యునల్స్ ని ఏర్పాటు చేసుకునే అధికారాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఏయే రాష్ట్రాల్లో లిటిగేషన్స్ అధికంగా ఉన్నాయో అక్కడ ట్రిబ్యునల్స్ అవసరమన్నారు. తెలంగాణలోనూ అనేక వివాదాల నేపథ్యంలో అనివార్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రెవెన్యూ.. ట్రిబ్యునల్..
తెలంగాణలో అనేక సమస్యలు తిష్ట వేశాయి. వీటన్నింటికి శాశ్వత పరిష్కార దిశగా అడుగులు వేయడానికి రెవెన్యూ, ట్రిబ్యునల్.. రెండు పని చేయడం ద్వారానే సాధ్యం. రికార్డు కరెక్షన్ మొదలుకొని అన్ని సమస్యల పరిష్కారంలో హయ్యర్ అథారిటీ ఉంటే బాగుంటుంది. అలాగే తహశీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్, కలెక్టర్ల బాధ్యతలకు కోత పెట్టడం కాదు. పరిష్కారానికి నోచుకోని లేదా అధికారుల నిర్ణయాలపైన నిర్ణయం తీసుకునేందుకు జిల్లా స్థాయిలోనే ట్రిబ్యునల్ ఉండడం ద్వారా కోర్టులకు భారం తగ్గుతుంది. ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ దిశగా అడుగులు వేయాలంటే సమస్యల తీవ్రతను తగ్గించుకోవాల్సిందే. రాష్ట్రంలో తహశీల్దార్, ఆర్డీవోలకు రికార్డింగ్ అథారిటీ ఉంది. అదనపు కలెక్టర్, కలెక్టర్ స్థాయిలో అప్పీల్‌కి వెళ్లే దిశగా చట్టం రూపొందిస్తున్నారు. ఆపై సీసీఎల్ఏకి వెళ్లకుండా జిల్లా స్థాయి ట్రిబ్యునల్‌లోనే తేల్చుకోవడం ద్వారా రైతులకు భారం తగ్గుతుంది. ఆర్వోఆర్‌తో పాటు మిగతా అన్ని అంశాల ప్రాతిపదికతోనే ఈ అథారిటీ నడవడం ద్వారా రైతులకు మేలు కలుగుతుంది. 124 రెవెన్యూ చట్టాలకు అనుగుణంగా న్యాయం పొందే వెసులుబాటు జిల్లా స్థాయిలోనే పొందేందుకు రెవెన్యూ శాఖతో పాటే ట్రిబ్యునల్ ఉండడం ద్వారా మెరుగైన భూ పరిపాలన ఏర్పడుతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోనూ తెలంగాణ ఉన్నత స్థితికి చేరుకునే వీలుంది.
కేసీఆర్ హయాంలో అడహక్ ట్రిబ్యునల్స్..
కేసీఆర్ హయాంలో ఆర్వోఆర్ 2020 కింద ఏర్పడిన ప్రత్యేక ట్రిబ్యునల్ జారీ చేసిన తీర్పుల్లో ఇరుపక్షాల వాదనలు వినలేదు. కేవలం రికార్డులను పరిశీలించి ఆర్డర్లు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 16,296 కేసులను పరిష్కరించినట్లు రాసుకున్నారు. ఆ రెవెన్యూ ట్రిబ్యునళ్లలో చాలా వరకు కేసుల్లో సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందేనంటూ జారీ చేసిన తీర్పులే అధికంగా ఉన్నాయి. ఏ రాష్ట్రంలోనూ ఒకరు ఇచ్చిన తీర్పుపై మళ్లీ విచారించిన దాఖలాలు లేవు. తెలంగాణలో మాత్రం రెవెన్యూ ట్రిబ్యునళ్లు జారీ చేసిన ఆదేశాలపై హైకోర్టు సూచన మేరకు అదే అధికారులు పున:విచారణ చేశారు. ఆ అధికారులే మళ్లీ విచారించినప్పుడు, వారి ఆదేశాలు తప్పని అంగీకరించే అవకాశమే లేదని, మళ్లీ అవే ఆర్డర్లు జారీ చేశారు. దాంతో సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని రిటైర్డ్ రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వం కింది నుంచి పై దాకా కోర్టులన్నీ రద్దు చేసింది. ఆఖరికి అప్పీల్ వ్యవస్థను కూడా రద్దు చేసింది. ఎక్కడైనా న్యాయం దక్కకపోతే అప్పీలుకు వెళ్లడం ఫండమెంటల్ రైట్.. దాన్ని తెలంగాణ రాష్ట్రంలో మింగేశారన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. గతంలో ఉన్న ల్యాండ్ ట్రిబ్యునల్, సీలింగ్ ల్యాండ్ ట్రిబ్యునల్, ల్యాండ్ గ్రాబింగ్ ట్రిబ్యునల్ వంటివి మనుగడలో లేకుండా చేశారు.
పార్ట్ బీ భూ సమస్యలకు అవసరం..
భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా ప్రతి గ్రామంలోనూ వివాదాల కారణంగా పదుల సంఖ్యలో పార్టు బీ భూములుగా ప్రకటించారు. వాటికి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. ధరణిలోనూ అప్లోడ్ చేయలేదు. ఇప్పటికీ వాటిని పరిష్కరించకుండా పెండింగ్లో పెట్టారు. కొన్నేమో భూ వివాదాలు ఉన్నాయని, మరి కొన్నేమో సర్వే నంబర్ లోని విస్తీర్ణానికి, రికార్డుల్లోని విస్తీర్ణానికి మధ్య వ్యత్యాసం ఉందంటూ నిలిపివేశారు. అలాంటి ఎన్నో వివాదాల కారణంగా ధరణిలోకి ఎక్కని భూములు ఉన్నాయి. వాటి పరిష్కారానికి ఎలాంటి మార్గాన్ని చూపలేదు. కేవలం ఇప్పటికే ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కానీ ఆచరణలో కనిపించలేదు. ధరణి పోర్టల్ ని అమల్లోకి తీసుకొచ్చారు. కానీ వివిధ కారణాలు చూపి ఏకంగా 18.45 లక్షల ఎకరాల భూమిని రికార్డుల్లోకి ఎక్కించలేదు. వారంతా వివిధ మాడ్యూళ్ల కింద దరఖాస్తు చేసుకున్న న్యాయం జరగడం లేదు.
పార్టు బీ ల్యాండ్స్