వీఆర్ఏల విలీనంలో నిజమెంత.. ఇలా జరుగుతోందని CM కేసీఆర్‌కు ముందే తెలుసా..?

వీఆర్ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయడంపై హైకోర్టు స్టే విధించడంతో ప్రభుత్వం చిత్తశుద్ధిపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

Update: 2023-08-12 04:44 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వీఆర్ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయడంపై హైకోర్టు స్టే విధించడంతో ప్రభుత్వం చిత్తశుద్ధిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎలాంటి కసరత్తు లేకుండా కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం చేశారా..? లేక నిజంగా నిబద్ధతతో చేశారా? అనే చర్చ జరుగుతున్నది. వీఆర్ఏలను సర్దుబాటు చేసే సమయంలో సరైన కసరత్తు చేయలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ముందు ఊహించినట్లుగానే..

ఇతర శాఖల్లో వీఆర్ఏలను విలీనం చేస్తే తలెత్తే సమస్యలను ముందుగా కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. విలీనం ద్వారా ఇతర శాఖల్లోకి వెళ్లిన వీఆర్ఏలతో, అప్పటికే అక్కడ పనిచేస్తున్న స్టాఫ్‌కు పదోన్నతుల విషయంలో ఇబ్బందులు వస్తాయని అలర్ట్ చేశారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో హడావుడిగా విలీన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేసీఆర్ ఆదేశాలతో వీఆర్ఏల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మేరకు సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేశారు. దీన్ని వ్యతిరేకించిన రెవెన్యూ శాఖలోని ఆఫీస్ సబార్డినేట్లు కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు స్టే ఇవ్వడంతో విలీన ప్రక్రియకు బ్రేక్ పడింది.

ఎన్నికల ముందు హడావుడి

గ్రామంలోని రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత 20,555 వీఆర్ఏల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. వారిని ఏ శాఖలో విలీనం చేయాలో క్లారిటీ రాలేదు. దీంతో వీఆర్ఏలు కొన్ని నెలలపాటు ఆందోళనలు చేశారు. వారిని శాంతింప చేయకపోతే ఆ ప్రభావం ఎన్నికల్లో ఉంటుందని గ్రహించి, విలీనం ప్రక్రియను తెరపైకి తెచ్చారు. అయితే ఇష్టానుసారం గా విలీనం చేయడంతో న్యాయపరమైన సమస్యలు వచ్చాయనే అభిప్రాయం ఐఏఎస్ వర్గాల్లో ఉంది.

‘అన్ని కోణాల్లో స్టడీ చేసి వీఆర్ఏలను ఇతర శాఖల్లో విలీనం చేస్తే సమస్యలు వచ్చేవికావు. ఇదే విషయాన్ని కేసీఆర్‌‌కు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వివరించారు. అయినా కేసీఆర్ వినిపించుకోకుండా విలీనం చేయాలని ఆదేశించారు.’ అని ఓ ఎమ్మెల్యే జరిగిన విషయాన్ని వివరించారు. స్టేను ఎత్తివేయాలని ప్రభుత్వం కోర్టుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నది. విలీనం విషయంలో తాము చేయాల్సినంత చేశామని, కోర్టు అడ్డుకుందనే కొత్త వాదనను తెరమీదికి తెచ్చి ఎన్నికల్లో ప్రచారం చేసుకోవాలనే వ్యూహంలో బీఆర్ఎస్ ఉన్నట్టు సమాచారం.

Read More: BRS ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రెడీ.. 75 నుంచి 80 మంది పేర్లు ఫిక్స్ చేసిన కేసీఆర్..!

Tags:    

Similar News