‘కాంట్రాక్ట్ టీచింగ్ స్టాఫ్’పై భిన్నాభిప్రాయాలు

విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్ టీచింగ్ స్టాఫ్ కొనసాగింపుపై ఉన్నత విద్యామండలి ఇటీవల జారీ చేసిన ఓ సర్క్యూలర్ తో విశ్వవిద్యాలయాలు విభేదిస్తున్నాయి.

Update: 2025-02-02 04:19 GMT
‘కాంట్రాక్ట్ టీచింగ్ స్టాఫ్’పై భిన్నాభిప్రాయాలు
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్ టీచింగ్ స్టాఫ్ కొనసాగింపుపై ఉన్నత విద్యామండలి ఇటీవల జారీ చేసిన ఓ సర్క్యూలర్ తో విశ్వవిద్యాలయాలు విభేదిస్తున్నాయి. అరవై ఏళ్లు దాటిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను కొనసాగించడంపై మల్లగుల్లాలు పడుతున్నాయి. రిటైర్మెంట్ ఏజ్ దాటిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల సేవలను కొనసాగించాలని ఇటీవల తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఓ సర్క్యులర్ జారీ చేసింది. బోధనా ప్రమాణాలను మెరుగుపర్చడానికి, నాణ్యమైన విద్యను అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నది. ఏమైనా లోటుపాట్లు ఉంటే.. ఒక్కో కేసును ప్రత్యేకంగా పరిశీలించాలని యూనివర్సిటీలను సూచించింది.

వేర్వేరు సర్వీస్ రూల్స్ ఎలా?

యూజీసీ నిబంధనల ప్రకారం 65 ఏళ్ల వరకు, రాష్ట్ర నిబంధనల ప్రకారం 63 ఏళ్ల వరకు సూపర్ యాన్యుయేషన్ ఇవ్వాలని ఓవైపు వర్సిటీల్లోని రెగ్యులర్ స్టాఫ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రిటైర్మెంట్ ఏజ్ 60 ఏళ్లు దాటిన కాంట్రాక్టు అధ్యాపకులను కొనసాగించాలని ఉన్నత విద్యామండలి సర్క్యులర్ జారీ చేయడాన్ని వర్సిటీలు వ్యతిరేకిస్తున్నాయి. రెగ్యులర్, కాంట్రాక్టు టీచింగ్ స్టాఫ్ కు వేర్వేరు సర్వీస్ రూల్స్ ఎలా వర్తింపజేస్తారని ప్రశ్నిస్తున్నాయి. ఒకవేళ కాంట్రాక్టు టీచింగ్ స్టాఫ్ ను కొనసాగిస్తే వారు వర్సిటీ కమిటీల్లో సభ్యులుగా ఉండరని, న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నాయి. రెగ్యులర్ స్టాఫ్ లా వారిని అన్నింటిలో భాగస్వాములను చేయలేమని పేర్కొంటున్నాయి.

వీసీల అభ్యంతరం

ఇటీవల యూనివర్సిటీల వీసీలు, ఉన్నత విద్యామండలి అధికారులతో సమావేశం జరిగింది. ఈ మీటింగులో కౌన్సిల్ జారీ చేసిన సర్క్యులర్ పై ఉస్మానియా, బీఆర్ఏఓయూ, ఎంజీయూ తదితర వర్సిటీల వైస్ చాన్సలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. యూనివర్సిటీల్లో కౌన్సిల్ జోక్యం సరికాదని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటాయని, వర్సిటీలకు ఉన్నత విద్యామండలి సలహాలు, సిఫార్సులు మాత్రమే చేయగలదని చెప్పారు. నిర్ణయాలను కచ్చితంగా అమలు చేయాలని ఒత్తిడి చేయవద్దని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ను కోరారు. దీనిపై స్పందించిన కౌన్సిల్ 60 ఏళ్లు పైబడిన కాంట్రాక్టు టీచింగ్ స్టాఫ్ కు వ్యక్తిగతంగా, ఆయా డిపార్ట్ మెంట్లలోని అవసరాలకు అనుగుణంగా మాత్రమే వారి సేవలను పొడిగించాలని మాత్రమే సూచించామని తెలిపింది.

వ్యతిరేకతకు కారణాలు ఇవే..

రిటైర్మెంట్ వయసు దాటిన కాంట్రాక్ట్ అధ్యాపకుల సేవలను పొడిగిస్తే.. అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. వర్సిటీల కమిటీల్లో సభ్యులుగా వారిని తీసుకోలేమని చెబుతున్నారు. రెగ్యులర్ స్టాఫ్ లా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనలేరని, విద్యాపాలసీల్లోనూ భాగస్వాములు కాలేరని పేర్కొంటున్నారు. వారు కేవలం బోధనకు మాత్రమే పరిమితం కావడంతోపాటు వేతన సమస్యలు, పరిపాలనపరమైన అభ్యంతరాలు వస్తాయని వివరిస్తున్నారు. అయితే వర్సిటీల్లోని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు కౌన్సిల్ సభ్యులు చెబుతున్నారు.

సర్కారు నిర్ణయానికి అనుగుణంగా..

కాంట్రాక్టు అధ్యాపకుల సేవలను కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు బహిరంగ వేదికలపై చెప్పారు. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి జీఓను ప్రభుత్వం జారీ చేయలేదు. దీంతో తమ సేవలను కొనసాగిస్తారా? లేదా? అని రిటైర్మెంట్ ఏజ్ కు దగ్గరలో ఉన్న కాంట్రాక్ట్ అధ్యాపకులు సందిగ్ధంలో ఉన్నారు. అయితే ఉన్నత విద్యామండలి సూచనాప్రాయంగా మాత్రమే సర్క్యులర్ జారీ చేసింది. దీనిపై యూనివర్సిటీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఉన్నత విద్యామండలి జీవో జారీ చేస్తే తప్పనిసరిగా యూనివర్సిటీలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ మేరకు ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశముందని, దానికనుగుణంగా ఉన్నత విద్యామండలి డిసిషన్ తీసుకునే చాన్స్ ఉన్నట్లు చర్చ జరుగుతున్నది.

Tags:    

Similar News