కిషన్‌రెడ్డి Vs బీజేపీ ఎమ్మెల్యేలు.. అసలు గొడవ ఎక్కడ మొదలయ్యిందో తెలుసా?

తెలంగాణ బీజేపీలో ముసలం మొదలైంది. కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి, బీజేపీ ఎమ్మెల్యేలకు ఏ మాత్రం పొసగడం లేదని తెలుస్తోంది.

Update: 2024-08-10 02:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బీజేపీలో ముసలం మొదలైంది. కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి, బీజేపీ ఎమ్మెల్యేలకు ఏ మాత్రం పొసగడం లేదని తెలుస్తోంది. దీంతో కిషన్‌రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్టుగా పరిస్థితి మారింది. కొద్ది రోజులుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం, ఎమ్మెల్యేలకు మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడినట్టు చర్చ జరుగుతోంది. రాష్ట్ర నాయకత్వం ఎలాంటి కార్యక్రమాల్లో వారిని ఇన్‌వాల్వ్ చేయకపోవడం, స్టేట్ యూనిట్ చేపట్టిన రాష్ట్ర పదాధికారుల సమావేశానికి కూడా ఎమ్మెల్యేలు గైర్హాజరవ్వడం ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే ఈ ముసలం రాజ్ భవన్ నుంచి మొదలై మరింత ఎక్కువైందని తెలుస్తోంది. అభిప్రాయ భేదాలు అక్కడి నుంచే షురూ అయ్యాయనే చర్చ జరుగుతోంది.

కనీస పరిచయం చేయకపోవడంపై ఆగ్రహం!

రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మను నియమించారు. ఆయన జూలై 31వ తేదీన హైదరాబాద్‌కు వచ్చారు. రాజ్ భవన్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకారానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమయంలో కిషన్‌రెడ్డి.. ఎమ్మెల్యేలను గవర్నర్‌కు కనీసం పరిచయం కూడా చేయకపోవడంపై పలువురు ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. కేంద్ర మంత్రి, స్టేట్ ప్రెసిడెంట్ అయి ఉండి కూడా ఎమ్మెల్యేలను పరిచయం చేయకపోవడమంటే తమను ఏ మాత్రం పట్టించుకోలేదని భావిస్తున్నట్టు తెలస్తోంది. ఇది తమను అవమానించడమేనని భావిస్తున్నట్టు సమాచారం. ఈ కారణంగానే ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకత్వానికి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడినట్టు చర్చించుకుంటున్నారు.

పార్టీలో అభిప్రాయ భేదాలపై శ్రేణుల్లో ఆందోళన

రాజ్ భవన్ వేదికగా బీజేపీ స్టేట్ యూనిట్, ఎమ్మెల్యేలకు మధ్య అగ్గి రాజుకున్న నేపథ్యంలోనే శాసనసభ సభ్యులు సహాయ నిరాకరణ చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశానికి 8 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరే హాజరయ్యారు. స్టేట్ యూనిట్ ఎమ్మెల్యేలను లైట్ తీసుకుంటే.. ఎమ్మెల్యేలు రాష్ట్ర పదాధికారుల సమావేశాన్ని లైట్ తీసుకుని కిషన్‌రెడ్డికి ఝలక్ ఇచ్చారని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్. త్వరలో ‘స్థానిక’ ఎన్నికలు రాబోతున్న తరుణంలో స్టేట్ ప్రెసిడెంట్ వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్టుగా పరిస్థితి తయారవ్వడంపై శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే స్టేట్ యూనిట్ ఆయా మోర్చాలకు ఎలాంటి యాక్టివిటీ చేయొద్దని ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఈ తరుణంలో ఎమ్మెల్యేల సహాయ నిరాకరణ పార్టీకి మరింత నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉంది. దీంతో శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్టేట్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యేల మధ్య అభిప్రాయ భేదాలు చక్కబడి సమన్వయంతో లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఢీ కొడతాయా? లేక వైరం మరింత పెరిగి చతికిలపడతారా? అనేది చూడాలి.

Tags:    

Similar News