మణిపూర్ ఆపరేషన్‌లోని పోలీసులకు డీజీపీ సన్మానం..
మణిపూర్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను సురక్షితంగా తీసుకు రావటంలో కీలకపాత్ర వహించిన పోలీసు అధికారులను డీజీపీ అంజనీ కుమార్మంగళవారం తన కార్యాలయంలో సన్మానించారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: మణిపూర్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను సురక్షితంగా తీసుకు రావటంలో కీలకపాత్ర వహించిన పోలీసు అధికారులను డీజీపీ అంజనీ కుమార్మంగళవారం తన కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థులతోపాటు కొందరు పౌరులను ఇక్కడికి క్షేమంగా తీసుకు రావటంలో పోలీసు అధికారులు ప్రశంసనీయమైన పాత్ర వహించటం అభినందనీయం అన్నారు. పర్వత ప్రాంతమైన మణిపూర్‌లో సరైన కమ్యూనికేషన్ వ్యవస్థ లేకున్నా అక్కడి పోలీస్, మిలటరీ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపటం, విద్యార్థులతో మాట్లాడటంతోపాటు వేర్వేరు ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకుని ప్రశంసనీయమని చెప్పారు. ఇలాంటి అనుభవాలు సరికొత్త పాఠాలను నేర్పిస్తాయన్నారు.
సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. కంట్రోల్‌రూం ఏర్పాటు చేసుకుని వేర్వేరు శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ 112మందిని సురక్షితంగా రాష్ర్టానికి తీసుకు రాగలిగినట్టు తెలిపారు. కాగా, విద్యార్థులను తరలించటంలో కీలకపాత్ర వహించిన అదనపు డీజీలు మహేశ్‌భగవత్, అభిలాష బిస్త్, డీఐజీ బీ.సుమతి, కంట్రోల్‌రూంలో విధులు నిర్వర్తించిన జయరాం, నగేష్‌బాబు, తిరుపతి, సుదర్శన్ తదితరులను డీజీపీ అంజనీ కుమార్సన్మానించారు. కార్యక్రమంలో అదనపు డీజీ శివధర్‌రెడ్డి, ఐజీలు షానవాజ్‌ఖాసీం, ఎం.రమేశ్ తదితరులు పాల్గొన్నారు.