పవర్ సప్లయ్‌లో ప్రాబ్లమ్.. విద్యుత్ శాఖ అధికారులకు డిప్యూటీ CM భట్టి కీలక ఆదేశం
అత్యధిక విద్యుత్ డిమాండ్ ఉన్నా.. సరఫరా చేసే సామర్థ్యం విద్యుత్ సంస్థలకు ఉందని, అయినా కొన్నిచోట్ల చిన్నపాటి ఇబ్బందులు వస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: అత్యధిక విద్యుత్ డిమాండ్ ఉన్నా.. సరఫరా చేసే సామర్థ్యం విద్యుత్ సంస్థలకు ఉందని, అయినా కొన్నిచోట్ల చిన్నపాటి ఇబ్బందులు వస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మెయింటెనెన్స్, ఓవర్ లోడ్ ఈ రెండు అంశాల సందర్భంలో ఈ ఇబ్బందులు వస్తున్నాయని, వీటిని సమన్వయం చేసుకొని తక్కువ సమయంలో సమస్యను పరిష్కరిస్తే ఎలాంటి ఫిర్యాదులు ఉండవని తెలిపారు. రానున్న వేసవిలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎండీ రిజ్వీతో కలిసి ట్రాన్స్ కో ఎస్ఈలతో సచివాలయం నుంచి డిప్యూటీ సీఎం బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే విద్యుత్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడడం సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రంలోని రైతులు, వ్యాపారులు, వినియోగదారులందరికీ నాణ్యమైన విద్యుత్తును సంపూర్ణంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
కమర్షియల్ ఏరియాలో మెయింటెనెన్స్ కోసం రాత్రివేళ లైన్ క్లియరెన్స్ (ఎల్‌సీ) తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక ప్రాంతం తర్వాత మరొక ప్రాంతాల్లో అది కూడా తక్కువ సమయం ఎల్‌సీ తీసుకోవాలని. ఎల్‌సీ తీసుకునే సమయాన్ని ఆయా ప్రాంతాల్లోని వినియోగదారులకు ముందే తెలియజేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో స్థానిక విద్యుత్ అధికారులు మాట్లాడి డిమాండ్‌కు తగినంతగా విద్యుత్ సరఫరా చేసే సామర్థ్యం ఉన్న విషయాన్ని వివరించాలని తెలిపారు. గత ఏడాదికి ఈ ఏడాదికి డిమాండ్ ఎంత పెరిగింది, ఆ మేరకు సప్లయ్‌ని ఎలా పెంచుతున్నామని గణాంకాలతో స్థానికంగా మీడియాకు అందించాలని కోరారు. రానున్న మూడు నెలలు విద్యుత్ డిమాండ్ ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరాకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
గత పాలకులు ప్రజలకు చేసింది తక్కువ, ప్రచారం చేసుకున్నది ఎక్కువ అని భట్టి విమర్శలు చేశారు. కావాలని అసత్యాలు ప్రచారం చేసే వారిపై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం సలహా ఇచ్చారు. జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సీఎండీకి, తన దృష్టికి తీసుకురావాలన్నారు. తాము 24 గంటలు అధికారులకు అందుబాటులో ఉంటామని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు కాల్ సెంటర్‌ను బలోపేతం చేయాలని, వినియోగదారుల నుంచి వచ్చే ప్రతి కాల్‌ను రికార్డు చేయాలని, ఆ ఫిర్యాదులకు ఏ పరిష్కారం చూపారో ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూకీ, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ట్రాన్స్ కో జేఎండీ శ్రీనివాస్, 37 జిల్లాల ఎస్ఈలు పాల్గొన్నారు.
టీఎస్ రెడ్కో పీడీ అమరేందర్ రెడ్డి బదిలీని నిలిపివేయాలని వినతి
టీఎస్ రెడ్కోలో ప్రాజెక్టు డైరెక్టర్‌గా పని చేస్తున్న అమరేందర్‌రెడ్డి బదిలీని నిలిపివేయాలని ఆలిండియా రెన్యూయబుల్ ఎనర్జీ ఎంటర్‌ప్రిన్యూర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి వినతి పత్రం అందజేశారు. అకస్మాత్తుగా ప్రాజెక్టు డైరెక్టర్ అమరేందర్ రెడ్డిని బదిలీ చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.16 కోట్ల సబ్సిడీ నిధులు జాప్యం అవుతాయని ఆయన విన్నవించారు. రెడ్కో నుంచి కేంద్ర ప్రభుత్వంతో సబ్సిడీ నిధులను రాబట్టడానికి అమరేందర్ రెడ్డి సమన్వయం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాలపై రూప్‌టాప్ సోలార్ పనులు వివిధ దశల్లో జరుగుతున్నాయని, ఆ పనులు కూడా అర్ధాంతరంగా ఆగిపోయే అవకాశముందన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సూర్య ఘర్ యోజన పథకం, పీఎం కుసుమ్ అమలులో సైతం జాప్యం కలిగే అవకాశం ఉన్నందున కనీసం మూడు నెలలైనా బదిలీని నిలిపివేయాలని కోరారు. అలాగే ఎంఎన్ఆర్ఈలో రెండు సంవత్సరాలుగా నిలిచిపోయిన రూ.16 కోట్ల సబ్సిడీ నిధులను త్వరగా ఇప్పించాలని మంత్రిని కోరారు.