‘కరెంట్’ వార్ పాలిటిక్స్! భట్టి వర్సెస్ కేటీఆర్ పవర్ కట్ కౌంటర్స్
కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య కరెంట్ వార్ నడుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కరెంట్ బంద్ అవుతుందని బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య కరెంట్ వార్ నడుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కరెంట్ బంద్ అవుతుందని బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నప్పుడు పవర్ కట్స్ లేవని బీఆర్ఎస్ నేతలు చెప్పుకొస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగర్ కర్నూల్ మీటింగ్ లో పవర్ కట్ అయ్యిందని కాసేపు మీటింగ్ ఆపారు. తర్వాత మైక్‌లు పనిచేశాక మార్పు బాగుందయ్యా అని కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిచారు. కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ నేతలు చేస్తున్న కరెంట్ ఆరోపణలకు తిరిగి కౌంటర్ ఇస్తున్నారు.
ఒక్క ప్రాజెక్టు కూడా కట్టని వ్యక్తి కరెంట్ ఇచ్చాడట
ఈ కరెంట్ ఆరోపణలపై తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిచారు. కేసీఆర్ ఉంటేనే కరెంట్ వచ్చిందని, కేసీఆర్ లేకపోతే కరెంట్ రాదని అంటున్నారని మండిపడ్డారు. అసలు కరెంటుకు సంబంధించి ఒక్క ప్రాజెక్టు కూడా కట్టని వ్యక్తి కరెంట్ ఇచ్చాడట.. మేము రాగానే కరెంట్ రాదటా? అని నిలదీశారు. నేడు రాష్ట్రంలో ఉన్న కరెంటు ఉత్పత్తి ప్రాజెక్టులు ఆ నాటి కాంగ్రెస్, ఇతర ప్రభుత్వాలే మొదలు పెట్టాయన్నారు. ఈ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కేవలం బద్రాద్రి, యాదాద్రి పవర్ ప్రాజెక్టులు మొదలుపెట్టారని, పనికి రాని సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పెట్టారని విమర్శించారు. విపరీతమైన భారం రాష్ట్రంపై వేశారని, అది పెద్ద గుదిబండల మారాబోతోందని ఆరోపించారు.
యాదాద్రి పవర్ ప్రాజెక్టు ఇంత వరకు ప్రొడక్షన్ లోకే రాలేదన్నారు. ఈ రెండే ఆయన మొదలు పెట్టారని, మరి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టుల నుంచే వచ్చే ఉత్పత్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిందని, కానీ బీఆర్ఎస్ ద్వారా వచ్చిన కరెంట్ ఏమీ లేదన్నారు. కరెంట్ లేదట అని కేసీఆర్ మాట్లాడుతున్నారని, కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా? అంటున్నారని గుర్తుచేశారు. తెలంగాణలో మరిన్ని కొత్త పవర్ ప్రాజెక్టులు తీసుకువస్తామని చెప్పారు. మీగులు కరెంట్ ఈ రాష్ట్రంలో ఉండే విధంగా చేస్తామని చెప్పారు.