డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట విషాదం

రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇంట విషాదం నెలకొంది. భట్టి విక్రమార్క సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు (70) అనారోగ్యంతో బాధపడుతూ.. మంగళవారం ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

Update: 2024-02-13 03:35 GMT

దిశ, వైరా : రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇంట విషాదం నెలకొంది. భట్టి విక్రమార్క సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు (70) అనారోగ్యంతో బాధపడుతూ.. మంగళవారం ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. హోమియో ఎండి చదివిన మల్లు వెంకటేశ్వర్లు ఆయుష్ శాఖలో ప్రొఫెసర్‌గా, అడిషనల్ డైరెక్టర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. అనంతరం వైరాలోని 1వ వార్డులో ఉన్న తన నివాసంలో హోమియో వైద్యశాలను నిర్వహిస్తున్నారు. అయితే గత మూడు నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. దీంతో ఇటీవల ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో మల్లు వెంకటేశ్వర్లును చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయనకు గత మూడు రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించి మంగళవారం ఉదయం 6 గంటల 50 నిమిషాలకు తుది శ్వాస విడిచారు.

మల్లు వెంకటేశ్వర్లకు హోమియో వైద్యంలో ఎంతో మంచి పేరు ఉంది. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వైరా లోని తన ఇంట్లో హోమియో ఆసుపత్రి నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అతని వద్ద వైద్యం చేయించుకునేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రోగులు వస్తుంటారు. డబ్బు కోసం కాకుండా సామాజిక బాధ్యతతో ఈ ఆసుపత్రిని ఆయన నిర్వహించారు. తన స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు మల్లు వెంకటేశ్వర్లు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నందిని దంపతులతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, మల్లు కుటుంబీకులు హాజరుకానున్నారు. మల్లు వెంకటేశ్వర్లు మరణవార్తతో స్నానాల లక్ష్మీపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Similar News