యాదాద్రి జాప్యానికి బాధ్యులెవరు?.. ఆ ఒప్పందంలో ఏమున్నది?

రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యంలో నిర్మించాల్సిన యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్దిష్ట గడువు ప్రకారం ఎందుకు కంప్లీట్ కాలేదని సంబంధిత అధికారులను డిప్యూటీ సీఎం (ఇంధన శాఖ వ్యవహారాలు) మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు.

Update: 2024-01-12 15:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యంలో నిర్మించాల్సిన యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్దిష్ట గడువు ప్రకారం ఎందుకు కంప్లీట్ కాలేదని సంబంధిత అధికారులను డిప్యూటీ సీఎం (ఇంధన శాఖ వ్యవహారాలు) మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అగ్రిమెంట్ ప్రకారం 2020 అక్టోబరు నాటికి రెండు యూనిట్లు (800 మెగావాట్ల చొప్పున), 2021 అక్టోబరు నాటికి మరో మూడు యూనిట్లు పూర్తికావాల్సి ఉన్నప్పటికీ ఎందుకు పెండింగ్‌లో పడ్డాయని ప్రశ్నించారు. ఈ పనులు సకాలంలో పూర్తికాకపోవడానికి బాధ్యులెవరని వారిని నిలదీశారు. ఇందుకు దారితీసిన కారణాలనూ వివరించాలని ఆదేశించారు. తాజా స్టేటస్‌ను తెలుసుకున్న డిప్యూటీ సీఎం.. ఎప్పటికల్లా యూనిట్లన్నీ ఫంక్షనింగ్‌లోకి వస్తాయని ఆరా తీశారు.

తెలంగాణ జెన్‌కో, విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి, బీహెచ్ఈఎల్ ప్రతినిధులతో సచివాలయంలో శుక్రవారం రివ్యూ నిర్వహించిన సందర్భంగా డిప్యూటీ సీఎం పై అంశాలపై సమీక్షించారు. రెండు దశల్లో 2021 అక్టోబరు నాటికే రెండు దశల్లో మొత్తం నాలుగు వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి కావాల్సి ఉన్నప్పటికీ ఎందుకు పెండింగ్‌లో పడ్డాయని ఆరాతీశారు. కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ విధానంలో టెండర్లను ఆహ్వానించడానికి బదులుగా నామినేషన్‌ పద్ధతిలో బీహెచ్‌ఈఎల్‌ సంస్థకు ఎందుకు పనులు అప్పగించాల్సి వచ్చిందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి విద్యుత్‌ కేంద్రం నిర్మాణానికి జెన్‌కో రూపొందించిన అంచనాలు, బీహెచ్‌ఈఎల్‌ కోట్‌ చేసిన రేటు, ధరల విషయంలో జరిగిన నెగోషియెషన్స్, అంగ్రిమెంట్‌ విలువ వంటి తదితర అంశాలతో సమగ్రంగా నివేదిక సమర్పించాలని ఇంధన శాఖ కార్యదర్శిని ఆదేశించారు.

యాదాద్రి పవర్‌ ప్లాంటు నిర్మాణానికి రూ. 34,500 కోట్ల అంచనాలతో 2015 జూన్‌ 6న బీహెచ్‌ఈఎల్‌తో ఒప్పందం చేసుకోగా, 2017 అక్టోబర్‌లో వర్క్‌ ఆర్డర్‌ జారీ అయిందని, ఈ అగ్రిమెంట్‌ ప్రకారం 2021 నాటికి పనులన్నీ ఎందుకు పూర్తి కాలేదని, ఇంకా విద్యుదుత్పత్తి ఎందుకు ప్రారంభం కాలేదని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. సకాలంలో ప్రభుత్వం బిల్లులు చెల్లించని కారణంగానే ఆలస్యమైందని బీహెచ్‌ఈఎల్‌ అధికారులు వివరించారు. పర్యావరణ అనుమతులు రాకపోవడం కూడా మరో కారణమని తెలిపారు. యాదాద్రి నిర్మాణానికి అంచనా వేసిన మొత్తం రూ.34,500 కోట్ల వ్యయంలో బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించిన పనులు విలువ ఎంత అని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. బీహెచ్‌ఈఎల్‌కు రూ. 20,444 కోట్లు విలువ చేసే పనులు అప్పగించగా మిగిలిన పనులను జెన్‌కో, మరికొన్ని సంస్థలు చేపట్టాయని బీహెచ్‌ఈఎల్‌ అధికారులు వివరించారు.

బీహెచ్ఈఎల్‌కు ఇచ్చిన పనుల్లో రూ. 15,860 కోట్ల మేర పనులు పూర్తికాగా, రూ. 14,400 కోట్ల చెల్లింపులు జరిగాయని, ఇంకా రూ. 1,167 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వం చెల్లింపులు విడతలవారీగా చేయలేదని, 2023 ఒక్క మార్చి నెలలోనే 91% పేమెంట్‌ చేసిందన్నారు. నిధులు సకాలంలో చెల్లించకపోవడంతో సబ్‌ కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయలేకపోయామని, దీంతో పనులు ప్లాన్డ్ గా జరగలేదని తెలిపారు. ఇప్పటివరకూ రాని పర్యావరణ అనుమతులను కనీసం ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి ప్రభుత్వం తీసుకురాగలిగితే సెప్టెంబర్‌ నాటికి రెండు యూనిట్లు (1600 మెగావాట్లు), డిసెంబర్‌ నాటికి మరో రెండు యూనిట్లు (2600 మె.వా), వచ్చే ఏడాది మే నాటికి మిగిలిన ఒక యూనిట్‌ (800 మె.వా)ను పూర్తి చేసి విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభిస్తామని పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా తెలియజేశారు. ఈ సమావేశంలో బీహెచ్‌ఈఎల్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కొప్పు సదా శివమూర్తి, డైరెక్టర్‌ తజీందర్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News