నిన్న డుమ్మ.. నేడు భేటీ.. డిప్యూటీ సీఎం భట్టి మరో వివాదం!
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మరోసారి అవమానం జరిగిందని సోషల్ మీడియాలో తీవ్ర దుమారం నడుస్తోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మరోసారి అవమానం జరిగిందని సోషల్ మీడియాలో తీవ్ర దుమారం నడుస్తోంది. ఇటీవల యాదాద్రిలో ప్రత్యేక పూజలు జరుగుతున్న సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రోటోకాల్ పాటించకుండా చిన్న పీట వేసి కింద కూర్చోబెట్టారని ఆరోపణలతో తీవ్ర వివాదం అయిన సంగతి తెలిసిందే. అయితే డిప్యూటీ సీఎం భట్టి దళితుడు కాబట్టే కింద కూర్చోబెట్టారని బీఆర్ఎస్ పార్టీ, ప్రజాసంఘాలు తీవ్రంగా కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులతో అధికారికంగా ఫోటో దిగారు. కానీ అందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కనిపించలేదు.
భట్టి విక్రమార్క తప్ప సీఎం, మంత్రులు గవర్నర్‌తో ఫోటో దిగడం చర్చానీయంశంగా మారింది. మరోసారి భట్టిని అవమానించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో నిన్న గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు ప్రత్యేకంగా గవర్నర్‌తో భేటీ అయ్యారు. గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్లే ఇవాళ భట్టి గవర్నర్‌ను కలిశారని ఓ నెటిజన్ అభిప్రాయం వ్యక్తంచేశారు. మరోవైపు భట్టి ముఖంలో సంతోషం లేదని మరో నెటిజన్ కామెంట్ చేశారు.