నీళ్లు వదిలితే ఆ రెండు బ్యారేజీల పని కూడా ఖతం: డిప్యూటీ సీఎం భట్టి

ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు దోచుకొని గత ప్రభుత్వం ఒక్క ఎకరాకు చుక్క నీరివ్వలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు.

Update: 2024-02-17 16:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు దోచుకొని గత ప్రభుత్వం ఒక్క ఎకరాకు చుక్క నీరివ్వలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాష్ట్రం ఎటుపోయినా సరే ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో దండుకున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం గుదిబండగా మారిందన్నారు. గత ప్రభుత్వం తప్పులను ఒప్పుకోవాలని సూచించారు. ఇరిగేషన్‌పై శ్వేత పత్రం చర్చలో శనివారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఏ నీళ్ల కోసం తెలంగాణను తెచ్చుకున్నామో.. ఆరాటపడ్డామో.. ఆ ఆరాటాన్ని బీఆర్ఎస్ పాలకులు నీళ్లలో కలిపారన్నారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు వచ్చి మేడిగడ్డ ఒకటే కాదు సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పరిస్థితి అలానే ఉందన్నారు. నీళ్లు వదిలితే అవి కూడా పోతాయని స్పష్టం చేశారన్నారు. వాళ్లు ఏం జ్యోతిష్యులు కాదని, కాళేశ్వరం ప్రాజెక్టు పై నీటిపారుదల రంగంలో జరిగిన అవకతవకలను స్పష్టంగా ప్రజెంటేషన్ ఇచ్చామన్నారు.

మేడిగడ్డలో ఫిల్లర్ నిట్టనిలువుగా పగళ్లు వచ్చాయన్నారు. రాష్ట్ర ప్రజలంతా చూశారన్నారు. 94 వేల కోట్లు ఖర్చుపెట్టి కుంగిపోతుంటే దేశం మొత్తం చూస్తోందని, హరీష్ రావు ఇంతకన్న అన్యాయం ఏంముంటుందన్నారు. అధికారులు విశ్లేషించి చెప్పారని, అయినా ఆయన సమర్ధించుకోవడం చూస్తుంటే ఇంతకంటే అన్యాయం ఉంటుందా..? అని ప్రశ్నించారు. 2004లో ప్రభుత్వం జలయజ్ఞం పేరిట ఇదే గోదావరిపై బాబా సాహెబ్ ప్రాణహిత సుజల స్రవంతి పేరిట రూ.38 వేల కోట్లు ఖర్చు చేసి 16.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు డిజైన్ చేశామని, ఉమ్మడి ఖమ్మం జిల్లా, నల్లగొండలో కొంత ప్రాంతం మినహాయిస్తే 7 ఉమ్మడి జిల్లాలకు సాగునీరు తాగునీరు హైదరాబాద్ పరిసరాల్లోని పరిశ్రమలకు నీళ్లు ఇవ్వాలని ఆ ప్రాజెక్టులో డిజైన్ చేశామన్నారు.

కానీ గత ప్రభుత్వం మిషన్ భగీరథ పేరిట రూ.50వేల కోట్లు ఖర్చు పెట్టారని, కాళేశ్వరం ఖర్చులు అది కలిపితే లెక్క ఎంత భయంకరంగా ఉంటుందన్నారు. నాటి మంత్రులు శ్రీధర్ బాబు, సబితలు పోరాటం చేసి ప్రాణహిత ప్రాజెక్టుకు పునాది రాయి వేశారని, 10వేల కోట్లు ఖర్చు పెట్టారన్నారు. తాము మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్నామని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడ ఖర్చు పెట్టారు అని అంటున్నారని, మొబులైజేషన్ అడ్వాన్స్ ఎవరికైనా లీడర్లకు ఇచ్చారా? ఇవ్వలేదు కదా? ఈపీసీ కాంటాక్ట్ ప్రకారం కాంట్రాక్టర్లకు ఇచ్చారు అని చెబుతున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు? అడ్వాన్సులు తీసుకున్న కాంట్రాక్టర్లతో పని చేయించాలి కదా? ప్రాజెక్టు హ్యాండోవర్ చేసుకోవాలి కదా? ప్రశ్నించారు.

ప్రాణహితకు పెట్టిన పదివేల కోట్లు పోగా మరో 28వేల కోట్లు మిగిలిందని, దానిని 1.87 లక్షల కోట్లకు పెంచారన్నారని మండిపడ్డారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరు మార్చి రీ డిజైన్ అంటూ కాళేశ్వరం పేరు పెట్టారని, ఖమ్మం జిల్లాలో రాజు ఇందిరాసాగర్ ప్రాజెక్టుల పూర్తికి కేవలం 1,425 కోట్లు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉందని, ప్రతి ఏటా 500 కోట్లు ఖర్చు చేసిన మొదటి మూడేళ్లలోనే ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేదన్నారు. ఇందులో 75 వేల ఎకరాలు ఇతర రాష్ట్రాలకు పోయిన నికరంగా 3.25 లక్షల ఎకరాలకు ఖమ్మం జిల్లాలో సాగునీరు అందేదన్నారు. 28 వేల కోట్లు ప్రాణహితకు, 2, 227 కోట్లు దేవాదులకు, 200 కోట్లు ఎస్సారెస్పీ స్టేజి- 2 కు గోదావరిపై మొత్తం కలిపినా 32,848 కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రంలో 31.30 లక్ష ఎకరాలకు సాగునీరు అందేదన్నారు. రీ డిజైన్ పేరిట 32,848 కోట్ల బడ్జెట్‌ను.. 1.72 లక్షల కోట్లకు పెంచారన్నారు. పదేళ్లలో ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. ఇప్పుడు మేమే రిపేర్ చేస్తాం అంటున్నారని, అప్పుడు కూడా ఇక్కడ కూర్చొని ఎవరూ అవసరం లేదు.. మేము ఇంజనీరింగ్ చేస్తాం అని డిజైన్ చేశారన్నారు.

అసలు మీరు ఏం చదువుకున్నారని డిజైన్ చేస్తారు.. ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తాం.. మీరు కట్టిన డ్యాం నిట్ట నిలువునా చీలింది.. కుప్పకూలిపోయిందని దుయ్యబట్టారు. మేడిగడ్డ లేకపోతే ఇక కాళేశ్వరం ఏముందని ప్రశ్నించారు. గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల నుంచి చుక్క నీరు తీసుకురాకుండా లక్షల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. ఒక్క ఎకరాకు నీరు ఇవ్వకుండా కాళేశ్వరం నిర్వహణకు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం 25 వేల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. 10వేల కోట్లు కరెంటు బిల్లులకు.. ప్రాజెక్టు నిర్వహణకు మరో 15 కోట్లు మొత్తం ఏటా 25 వేల కోట్ల భారం పడుతుందన్నారు. కాళేశ్వరం రాష్ట్ర ప్రభుత్వానికి గుదిబండ కాకపోతే ఏమిటని ప్రశ్నించారు. ఆ భారాన్ని మోయలేక లెక్కలు సరి చేయలేక తలలు పగిలిపోతున్నాయన్నారు. వాస్తవాలు వివరించేందుకు ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఒకటే అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సత్యదూరమైన మాటలు మానుకోవాలని, బీఆర్ఎస్ కాళేశ్వరంలో చేసిన తప్పులను ఒప్పుకోవాలని హితవు పలికారు. 


Similar News