పట్టాలెక్కని KBR పార్కు ప్రాజెక్టులు.. ఆలస్యానికి కారణం అదేనా?
కేబీఆర్ పార్కు చుట్టూ జంక్షన్ల అభివృద్ధిలో భాగంగా నిర్మించనున్న ఫ్లైఓవర్లు, అండర్ పాసుల నిర్మాణం, బంజారాహిల్స్ రోడ్డు నెం.12(విరంచీ ఆస్పత్రి నుంచి కేబీఆర్ పార్కు వరకు) రోడ్డు విస్తరణ పనులు అటకెక్కాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: కేబీఆర్ పార్కు చుట్టూ జంక్షన్ల అభివృద్ధిలో భాగంగా నిర్మించనున్న ఫ్లైఓవర్లు, అండర్ పాసుల నిర్మాణం, బంజారాహిల్స్ రోడ్డు నెం.12(విరంచీ ఆస్పత్రి నుంచి కేబీఆర్ పార్కు వరకు) రోడ్డు విస్తరణ పనులు అటకెక్కాయి. ఆస్తుల సేకరణకు నోటిఫికేషన్ జారీ చేయకపోవడమే కారణమని పలువురు ఇంజినీరింగ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్ రెడీ చేయడంతో పాటు 299 ఆస్తులను సేకరించాల్సి ఉందని నివేదికను సిద్ధం చేశారు. ఇంజినీరింగ్ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతోనే భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఆలస్యమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు.
229 ఆస్తుల సేకరణకు రూ.741కోట్లు
కేబీఆర్ పార్కు చుట్టూ జంక్షన్ల అభివృద్ధితో పాటు విరంచీ ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ ప్రాజెక్టులో మొత్తం 229 ఆస్తులను గుర్తించారు. ఈ ప్రాపర్టీలు 56,621.30చదరపు గజాల విస్తీర్ణం ఉన్నట్టు గుర్తించారు. వీటి సేకరణకు రూ.741కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు. విరంచీ ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు జంక్షన్ వరకు 6.50కిలోమీటర్ల పొడవు 100 ఫీట్ల నుంచి 120 ఫీట్ల వరకు రోడ్డు విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ మార్గంలో 81ఆస్తులను సేకరించాలని అధికారులు గుర్తించారు. కేబీఆర్ పార్కు ఎంట్రెన్స్, ముగ్ద జంక్షన్ల పరిధిలో 40, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్ 47, మహారాజా అగ్రసేన్ జంక్షన్‌లో 34, ఫిల్మ్ నగర్ జంక్షన్ లో 43, రోడ్డు నెంబర్ 45 జంక్షన్ లో 36, కాన్సర్ ఆస్పత్రి జంక్షన్ లో 18 ఆస్తులను సేకరించాల్సి ఉంది.
సమావేశం కాని టెక్నికల్ కమిటీ
కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్లలో ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్ పాసులు నిర్మించాలని ప్రతిపాదించి టెండర్ పిలవడంతో పాటు టెక్నికల్ బిడ్‌ను సైతం మార్చి 27న ఓపెన్ చేశారు. మెగా ఇంజినీరింగ్ కంపెనీ, ఎంవీఆర్ కంపెనీ, కేఎన్ఆర్ అనే ఏజెన్సీలు బిడ్ దాఖలు చేశాయి. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ, పబ్లిక్ హెల్త్ విభాగం ఈఎన్సీ, జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ (ప్రాజెక్టులు), జలమండలి డైరెక్టర్, ఫైనాన్స్ విభాగం సీనియర్ అధికారులతో కూడిన కమిటీ సమావేశంలో ఎజెన్సీ ఫైనల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫైనాన్సియల్ బిడ్‌ను సైతం ఫైనల్ చేయాల్సి ఉంటుంది. కానీ టెక్నికల్ బిడ్లను ఓపెన్ చేసి 10రోజులు గడుస్తున్నా కమిటీ సమావేశం నిర్వహించకపోవడంతో ప్రాజెక్టు పనులు మరింత ఆలస్యమవుతున్నాయి. దీంతో పాటు జీహెచ్ఎంసీ ప్రాజెక్టు విభాగానికి పూర్తిస్థాయి చీఫ్ ఇంజినీర్ లేకపోవడమే ప్రధాన కారణమని పలువురు ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు కిందిస్థాయి ఇంజినీరింగ్ అధికారులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్‌ను పట్టించుకోకపోవడంతో పాటు ఆయన చెప్పిందే వేదమనేలా వ్యవహరిస్తున్నారని పలువురు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.