రాష్ట్రపతి ఎన్నికల్లో ఆదుకునేదెవరు? బీజేపీకి కొత్త సమస్య

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంతకాలం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హడావిడిలో

Update: 2022-03-14 00:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంతకాలం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హడావిడిలో బీజేపీ తలమునకలై ఉన్నది. ఇక ఇప్పుడు జూలైలో జరగాల్సిన రాష్ట్రపతి ఎన్నికలపై ఫోకస్ పెట్టాల్సి వస్తున్నది. నాలుగు రాష్ట్రాల్లో గెలిచినా బీజేపీకి పెద్దగా ఉపశమనం లభించలేదు. పైగా ఎన్నికలకు ముందు ఉన్న ఓటు బ్యాంకు కూడా ఇప్పుడు దెబ్బతిన్నది. ఆ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినా ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోయింది. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో అప్పటివరకూ ఉన్న ఓట్ల విలువలో 13000 తగ్గింది. దీన్ని సమకూర్చుకోవాలంటే అనివార్యంగా ఇతర పార్టీల మద్దతుపై ఆధారాపడాల్సి వస్తున్నది. ఏపీలోని అధికార వైసీపీ ఆదుకుంటుందా? లేక ఒడిశాలోని బీజేడీ ఆదుకుంటుందా? అనే లెక్కలు మొదలయ్యాయి. ఈ రెండింటిలో ఒక్క పార్టీ మద్దతు పలికినా బీజేపీ నిలబెట్టే రాష్ట్రపతి అభ్యర్థి గెలిచినట్లే.

రాష్ట్రపతిని ఎన్నుకోడానికి అవసరమైన ఓట్ల విలువలో ప్రస్తుతం బీజేపీకి 48.8% మాత్రమే అనుకూల పరిస్థితి ఉన్నది. ఇంకా 1.12% ఓట్లు (విలువ ప్రకారం) అవసరమవుతున్నది. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు దాదాపు సగం ఓట్లు (కేవలం 0.05% తక్కువగా) ఉన్నాయి. కానీ ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు మిత్రపక్షాలతో కలిపి 323 సీట్లు (ఎమ్మెల్యే) ఉంటే ఇప్పుడు అది 273కు తగ్గిపోయింది. దీంతో 50 సీట్ల మేర ఓట్ల విలువను కోల్పోవాల్సి వచ్చింది. ఆ రాష్ట్రంలో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 208 కావడంతో దాదాపు 10,400 మేర తగ్గింది. ఉత్తరాఖండ్‌లో 56 నుంచి 47కు తగ్గడంతో 9 మంది ఎమ్మెల్యేల ఓట్ల విలువ 576 తగ్గిపోయింది.

ఇక గోవాలో 28 నుంచి 20కు సీట్లు తగ్గిపోవడంతో 8 మంది ఎమ్మెల్యేల 160 ఓట్ల విలువ తగ్గింది. మణిపూర్‌లో ఇంతకాలం ఉన్న 36 మంది ఎమ్మెల్యేలకు బదులుగా ఇప్పుడు 32 మందే ఉండడంతో నలుగురి ఓట్ల విలువ 72 తగ్గింది. ఈ ప్రకారం మొత్తం 11,208 ఓట్లు తగ్గాయి. గతంలో కేవలం 1712 ఓట్లు మాత్రమే తక్కువగా ఉంటే ఇప్పుడు దాదాపు 13 వేలకు చేరుకుంది. దీంతో అనివార్యంగా ఇతర పార్టీల నుంచి మద్దతు పొందాల్సి వస్తున్నది. వైసీపీ లేదా బీజేపీ లాంటి ఫ్రెండ్లీ పార్టీల నుంచి సాయం తీసుకోవాల్సి వస్తున్నది. ఆయా రాష్ట్రాల్లో జనాభాకు (1971 జనాభా లెక్కల ప్రకారం) ఎమ్మెల్యే ఓటు విలువ మారుతూ ఉంటుంది. పార్లమెంటు సభ్యుల (రాజ్యసభ లేదా లోక్‌సభ) ఓటు విలువ మాత్రం స్థిరంగా 708 చొప్పున ఉంటుంది.

ఇంతకారం ఫ్రెండ్లీగా ఉన్న టీఆర్ఎస్ పార్టీకి 16 మంది ఎంపీలు (ఉభయ సభలు కలిపి) ఉన్నారు. వీరి ఓటు విలువ 11,328. టీఆర్ఎస్‌కు 103 మంది ఎమ్మెల్యేల (ఒక్కొక్కరి ఓటు విలువ 132) ఓటు విలువ 13,596. ఈ పార్టీ తరఫున మొత్తంగా 24,924 అవుతుంది. కానీ ఈ రెండు పార్టీల మధ్య స్నేహంలో తేడా వచ్చినందువల్ల బీజేపీ అడిగే అవకాశం లేకుండాపోయింది. చివరకు వైసీపీ లేదా బీజేడీ సభ్యులే ఆదుకోనున్నారు. ఏపీ ఎమ్మెల్యే ఓటు విలువ 159 కాగా, ఒడిశా ఎమ్మెల్యేది 149. బీజేపీకి ఎన్నో అంశాల్లో ఈ రెండు పార్టీలు గతంలో మద్దతు పలికాయి. అనేక కీలక బిల్లులకు పార్లమెంటులో అనుకూలంగానే ఓటు వేశాయి. ఇప్పుడు అడగ్గానే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉండొచ్చని బీజేపీ ధీమాతో ఉన్నది. ఏ అభ్యర్థిని నిలబెట్టినా రాష్ట్రపతిగా గెలిపించుకోవడం కష్టమేమీ కాదనే నమ్మకంతో ఉన్నది.

Tags:    

Similar News