మృగశిర కార్తె.. చేప మందు పంపిణీకి డేట్ ఫిక్స్.. ఏర్పాట్లు చేస్తున్న బత్తిన ఫ్యామిలీ
ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు ఇచ్చే చేప మందు ‘ప్రసాదం’.. ఈ ఏడాది కూడా చేప ప్రసాదం ఇచ్చేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు ఇచ్చే చేప మందు ‘ప్రసాదం’.. ఈ ఏడాది కూడా చేప ప్రసాదం ఇచ్చేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రసాద పంపిణీదారులు బత్తిన ఫ్యామిలీ తాజాగా కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జూన్ 8న ప్రసాదం పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రసాదం తింటే ఆస్తమా తగ్గుతుందని ప్రజల నమ్మకం. ఈ నేపథ్యంలోనే చేప ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాల నుంచి సైతం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు వేల సంఖ్యలో వస్తుంటారు. తాజాగా ప్రసాదం పంపిణీ పై ప్రభుత్వ అనుమతి కూడా ఇప్పటికే తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు ప్రసాదం తయారీ ప్రక్రియను కూడా ప్రారంభించారు.
ఏటా మృగశిర కార్తె ప్రవేశించిన రోజున ఈ ప్రసాదం బతికి ఉన్న చేపలో పెట్టి పంపిణీ చేస్తుంటారు. ఈ ఏడాది జూన్ 8న మృగశిర కార్తె ప్రవేశిస్తోంది. ఆ రోజు చేప ప్రసాదం పంపిణీ చేయబోతున్నట్టు బత్తిన అనురీత్‌గౌడ్, గౌరీ శంకర్ గౌడ్‌లు తెలిపారు. చేప ప్రసాదం పంపిణీ లో భాగంగా పంపిణీకి ముందు రోజు ప్రత్యేక పూజలు చేస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతం, తర్వాత భావి పూజ చేసిన అనంతరం ప్రసాదం తయారీ ప్రక్రియ పూర్తి చేస్తారు. తర్వాత రోజు జూన్ 8 నుంచి పంపిణీ స్టార్ట్ అవుతుంది.