ఎస్పీడీసీఎల్ కు రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ అవార్డు
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు ఇండియన్ చాంబర్ అఫ్ కామర్స్(ఐసీసీ) సోలార్ రూఫ్ టాప్ ఎనర్జీ అవార్డు దక్కింది.
దిశ, తెలంగాణ బ్యూరో : దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు ఇండియన్ చాంబర్ అఫ్ కామర్స్(ఐసీసీ) సోలార్ రూఫ్ టాప్ ఎనర్జీ అవార్డు దక్కింది. ఈ అవార్డును ఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీన్ ఊర్జా అవార్డ్స్ కాన్ఫరెన్స్ లో ఎస్పీడీసీఎల్ సంస్థ ప్రతినిధికి అందజేశారు. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సంస్థలపై భారం పడకుండా, విద్యుత్ సరఫరా నష్టాలు తగ్గించడంతో పాటు రాష్ట్రంలో సౌర ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగదారులను ప్రోత్సహించడంలో కృషిచేసినందుకు ఎస్పీడీసీఎల్ కు ఈ అవార్డుకు దక్కింది.
రాష్ట్రం ఏర్పడిన నాడు 71 మెగావాట్లగా ఉన్న సౌర విద్యుత్ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం 5748 మెగావాట్లకు చేరిందని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డి తెలిపారు. అలాగే దక్షిణ విద్యుత్ పంపిణి సంస్థ పరిధిలో 46 మెగావాట్లుగా ఉన్న సౌర విద్యుత్ ప్లాంట్ల ఉత్పత్తి సామర్ధ్యం ప్రస్తుతానికి 4025 మెగావాట్లకు చేరిందని వెల్లడించారు. అలాగే 0.45 మెగావాట్లు మాత్రమే ఉన్న సోలార్ రూఫ్ టాప్ నెట్ మీటరింగ్ స్థాపిత సామర్థ్యం ప్రస్తుతానికి 259 మెగావాట్లకు చేరిందని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డి తెలిపారు.