సోమవారం మడతలు పడిన బట్టలనే ధరించండి.. ఉద్యొగులకు సీఎస్ఐఆర్ ఆదేశం.. అసలు రీజన్ ఏంటంటే?
తమ సిబ్బంది సోమవారం మడతలు పడిన దుస్తువులనే ధరించాలని సీఎస్ఐఆర్ ఆదేశించింది.
దిశ, డైనమిక్ బ్యూరో:సోషల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి వచ్చాక నెటిజన్లు రకరకాల విషయాలను ట్రెండ్ చేస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏ అంశం ట్రెండింగ్ గా మారుతుందో ఊహించడం సాధ్యం కావడం లేదు. ఇలా ట్రెండ్ అవుతున్న వాటిలో వెర్రి వేషాలు కొన్ని ఉంటే సామాజానికి, పర్యావరణానికి పనికి వచ్చే అంశాలు మరికొన్ని ఉంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా భారతదేశంలోని పరిశోధన ల్యాబ్‌ల అతిపెద్ద పౌర నెట్‌వర్క్ అయిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) తమ ఉద్యోగులు మడత పడిన దుస్తువులను ధరించాలని సూచించింది. సోమవారాల్లో ఇస్త్రీ చేయని దుస్తువులు ధరించాలని సుచించింది.'స్వచ్ఛతా పఖ్వాడా'లో భాగంగా 'వింకిల్స్ అచ్చే హై' క్యాంపెయిన్ ను ప్రారంభించింది. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ప్రతి సోమవారం ఐరన్ (ఇస్త్రీ) చేయని దుస్తులను ధరించడమే ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం అని ఈ మేరకు సిబ్బంది సహకరించాలని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్ కలైసెల్వి పిలుపునిచ్చారు. ఒక జత బట్టలను ఇస్త్రీ చేయడం వల్ల 200 గ్రాముల కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది. అందువల్ల ఒక రోజు ఇస్త్రీ చేయని దుస్తువులనే ధరించడం ద్వారా 200 వరకు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నిరోధించవచ్చని ఆమె తెలిపారు. మడతలు పడిన దుస్తువుల క్యాంపెయిన్ తో పాటు దేశంలోని తమ అన్ని ల్యాబ్ లలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంపై కూడా సీఎస్ఐఆర్ దృష్టి సారించింది. తమ కార్యాలయంలో విద్యుత్ ఛార్జీలను 10 శాతం తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కార్పొరేట్ వరల్డ్ లో ఇప్పటి వరకు 'థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే' లేదా 'క్యాజువల్ ఫ్రైడే' డ్రెస్ కోడ్‌ని చాలా కార్పొరేట్ సంస్థలు పాటించగా తాజాగా సీఎస్ఐఆర్ తీసుకున్న మడత దుస్తుల నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.