ఎంపీ ఎన్నికల్లో సీపీఎం పోటీ.. ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో తెసుసా?

తెలంగాణలో వామపక్ష పార్టీలు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నాయి.

Update: 2024-02-11 12:34 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో వామపక్ష పార్టీలు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు సీపీఎం స్పష్టం చేసింది. రాష్ట్రంలో రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. సీపీఎం రాష్ట్ర సెక్రటేరియట్‌, రాష్ట్రకమిటీ సమావేశాలు 9,10 తేదీలలో హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో జరిగాయి. పార్టీ పొలిట్‌బ్యురో సభ్యులు బివి రాఘవులు, విజయరాఘవన్‌ హాజరయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం రాజకీయ పరిస్థితి, లోక్‌సభ ఎన్నికలు, తదితర అంశాలను సమావేశంలో చర్చించారు.

మరోవైపు రెండు స్థానాల్లో పోటీ చేయాలనే విషయంపై స్ధానిక జిల్లా కమిటీలతో చర్చించిన అనంతరం త్వరలో సీట్లను ఖరారు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఐతో పొత్తు ఉండాలని భావించిన పార్టీ.. సీట్ల సర్ధుబాటు కుదరకపోవడంతో ఒంటరిగానే ఎన్నికల్లో బరిలోకి దిగింది. పోటీ చేసిన 17 స్థానాల్లో కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయింది. దీంతో పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తుందా? లేదా పొత్తులు పెట్టుకునే ఆలోచన చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. కాగా, ఈ సారి కూడా ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.

సీపీఐ పార్టీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం సీటు మాత్రమే కాంగ్రెస్ ఇచ్చింది. ఆ స్థానంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. ఇటీవల ఎంపీ సీట్లపై సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సీపీఐ పార్టీ ‘ఇండియా’ కూటమిలో ఉందని, కూటమిలో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఐదు పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. పొత్తు వల్ల సీపీఐ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి బదిలీ అవుతాయన్నారు.

Tags:    

Similar News