గౌరవప్రదమైన సీట్లు వస్తేనే పొత్తు.. సీపీఐ కార్యదర్శి కూనంనేని
సీపీఐ, సీపీఎం ఇద్దరికీ గౌరవ ప్రదంగా సీట్లు ఉంటేనే పొత్తులకు ఒప్పుకుంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: సీపీఐ, సీపీఎం ఇద్దరికీ గౌరవ ప్రదంగా సీట్లు ఉంటేనే పొత్తులకు ఒప్పుకుంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. సీట్లకు కక్కుర్తిపడే వారెవ్వరూ ఇక్కడ లేరని అన్నారు. మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధుంభవన్‌లో సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వాళ్ళు పోటీ చేస్తామని చెప్పుకోవచ్చని, కానీ కమ్యూనిస్టుల తరపున కూడా వ్యాఖ్యలు చేయకూడదని హితువు పలికారు. కమ్యూనిస్టులకు ఓట్లే పడకపోతే ‘మీ అవసరానికి’ తమ వద్దకు ఎందుకు వస్తున్నారని నిలదీశారు. పిచ్చిపిచ్చిగా, నోటికి ఏది పడితే అది మాట్లాడితే, బాగుండదని కూనంనేని హెచ్చరించారు. తమ విధానాలు తమకు ఉంటాయని, ఎన్నికలు వచ్చినప్పుడు ఆ సందర్భంలో సీట్ల సర్దుబాటు మాట్లాడుతామని స్పష్టంచేశారు. 119 నియోజకవర్గాల్లో సీపీఐ, సీపీఎం పార్టీలకు క్యాడర్ ఉందన్నారు. 40, 50 స్థానాల్లో కమ్యూనిస్టు పార్టీల ప్రాబల్యం ఉందన్నారు.
కమ్యూనిస్టు పార్టీల సమ్మేళనం చరిత్రలో తొలిసారి
ప్రజా సమస్యల పరిష్కారానికి ఉమ్మడిగా ప్రజా ఉద్యమాలను చేపడతామని, రాబోయే ఎన్నికల్లో కలిసే ముందుకు సాగుతామని సీపీఐ, సీపీఎం రాష్ట్ర నాయకులు ప్రకటించారు. ఇరు పార్టీల మధ్య మరింత ఐక్యత దిశగా ఈ నెల 9న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ‘ రెండు పార్టీల మండల స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నాయకుల సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీ శ్రేణులను మరింత ఐక్యపర్చేందుకు, రాబోయే రాజకీయాల పెనుమార్పలకు, మంచి పరిణామాలకు ఈ సమ్మేళనం ఎంతో దోహదపడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. రాష్ట్రంలో బీజేపీని అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకుంటామని వారు స్పష్టం చేశారు. రెండు పార్టీల జాతీయ నాయకులు హాజరుకానున్నట్టు వారు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల సమ్మేళనం జరగడం ఇదే తొలిసారి అని, ఈ సమావేశానికి పెద్ద ఎత్తున ఉభయ పార్టీల శ్రేణులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమాల కార్యాచరణ ఉంటుందన్నారు. బీజేపీనీ వ్యతిరేకించే క్రమంలోనే బీఆర్‌ఎస్‌తో కలుస్తామని స్పష్టంచేశారు. రాహల్ లోక్ సభ్యత్వాన్ని తొలగించడాన్ని వారు ఖండించారు. వెంటనే ఆయనపై అనర్హత వేటును తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని సిట్, కేంద్ర దర్యాప్తు సంస్థలపై అనేక అపోహలు వస్తున్న నేపథ్యంలో పేపర్ లిక్ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో సమగ్రంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి, జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చెరుపల్లి సీతారాములు తదితరులు పాల్గొన్నారు.