జీవో 59 క్రింద ఇండ్ల క్రమబద్దీకరణ రుసుము తగ్గించాలి.. Kunamneni Sambasiva Rao
జీవో 59 క్రింద పేద, మధ్యతరగతి వర్గాలకు నామమాత్రపు ధరకే నివాస స్థలాలను క్రమబద్దీకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో : జీవో 59 క్రింద పేద, మధ్యతరగతి వర్గాలకు నామమాత్రపు ధరకే నివాస స్థలాలను క్రమబద్దీకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ జోవో క్రింద క్రమబద్దీకరణ రుసుంను ప్రస్తుత మార్కెట్ ధర ఆధారంగా నిర్ణయించడంతో చెల్లించాల్సిన మొత్తం కొన్ని చోట్ల పదుల లక్షలలో ఉన్నదని అన్నారు. దీంతో జీవో 59 క్రింద తమ ఇంటి స్థలాలను క్రమబద్దీకరించుకోవలనుకున్న చాలా మంది ఆశలు అడియాశలు అయ్యాయని, ఆ మొత్తాన్ని కట్టలేక పోతున్నారని తెలిపారు. నిర్ణీత తేదీలోగా క్రమబద్దీకరణ రుసుమును చెల్లించకపోవడంతో రెవెన్యూ యంత్రాంగం ఆ ఇండ్లను కూల్చివేసేందుకు పూనుకుంటుందని అన్నారు.
ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్`మల్కాజ్‌గిరి జిల్లాలలో ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. పేద ప్రజల ఎదుర్కొంటున్న ఈ సమస్యపై తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని ఇండ్ల కూల్చివేతను నిలిపివేసేందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ జీవో 59 క్రింద దరఖాస్తు చేసుకున్న బీపీఎల్ వర్గాల వారికి జీవో 59 క్రింద ఉచితంగా క్రమబద్దీకరించేందుకు అవకాశం కల్పించాలని అయన సూచించారు.