కేటీఆర్ వ్యాఖ్యలు సరైనవి కావు.. అసెంబ్లీలో ఎమ్మెల్యే కూనంనేని
బీఆర్ఎస్, మజ్లిస్, బీజేపీ పార్టీలు కలిపి 54 మంది ఎమ్మెల్యేలం ఉన్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతున్నారని ఆ వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్, మజ్లిస్, బీజేపీ పార్టీలు కలిపి 54 మంది ఎమ్మెల్యేలం ఉన్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతున్నారని ఆ వ్యాఖ్యలు సరైనవి కావని.. ఇది మంచి పద్ధతి కాదని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. ‘అసెంబ్లీని ఎక్కువ రోజులు నడపాలి. ఈ సమావేశాలకు ప్రతిపక్షం సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా నిధులు రావాల్సి ఉంది. బీఆర్ఎస్ చేసిన తప్పులను చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్లాలి. ఈ ప్రభుత్వం ఎంత కాలం ఉంటుందో చూస్తామని బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు అనడం సరైంది కాదు. కొంత మంది ఎమ్మెల్యేలు అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు’ అని తెలిపారు. అసెంబ్లీలో నిర్మాణాత్మక చర్చలు జరగాలని చెప్పారు.
గతంలో బడ్జెట్, చర్చ ఒక్కరోజులోనే పూర్తి చేశారని.. మొక్కుబడిగా సభ జరిగిందని ఆయన విమర్శలు చేశారు. గతంలో వైఎస్ చెప్పిన హమీలన్నీ నెరవేర్చారని.. జలయజ్ఞానికి నిధులు వాటంతట అవే సమకూరాయని తెలిపారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. దశాబ్ద కాలంపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని అన్నారు. ప్రజల ఆలోచన పక్కదారి పెట్టే అంశం గత పదేళ్ళలో చేశారని కూనంనేని ఆరోపించారు. కొనుగోలు.. అమ్మకాలు చాలా చూశాం.. అమ్ముడు పోయిన వాళ్ళు ఒక్కడు కూడా అసెంబ్లీకి రాలేదని విమర్శించారు. ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఉద్యమ పార్టీగా వచ్చిన భారత రాష్ట్ర సమితి ప్రజా స్వేచ్ఛను హరించందని కూనంనేని విమర్శించారు.