బీఆర్ఎస్ తరలించిన ఆ డబ్బుపై విచారణ జరపాలి: చాడ వెంకటరెడ్డి
అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ తరలించిన కోట్ల డబ్బులపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ...
దిశ , తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ తరలించిన కోట్ల డబ్బులపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎలక్షన్ సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బుపై ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ టాపింగ్‌లో విసుగుగొల్పే నిజాలు బయటకు రావడం పోలీసు అధికారుల దిగజారుడు విధానాలకు అద్దంపడుతున్నదన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారులు ఫోన్ ట్యాపింగ్, డబ్బులు తరలించే వంటి చర్యలకు పాల్పడితే కంచే చేను మేసిన చందంగా ఉంటుందని దుయ్యబట్టారు. ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికే పెనుముప్పులాంటిందని పేర్కొన్నారు. కోర్టు కుడా బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అరాచకాలను విచారించి, చట్టబద్దంగా శిక్షించాలని ఆయన కోరారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో ఏ శాఖను కదిలించిన అవినీతి కంపు బయట పడుతుందన్నారు. పదవీ కాలం పూర్తయిన ఉన్నతాధికారులను వారి పదవులను పొడిగించి విచ్చలవిడిగా డబ్బులు సంపాదించుకోవడానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవకాశం కల్పించి, అవినీతిని ప్రోత్సహించిందని అన్నారు. పోలీస్ ఉన్నతాధికారులతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంతపెద్దవారున్నా కఠిన శిక్షించాలని ఆయన కోరారు. పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా తన విధులను నిర్వహించకుండా అధికారపార్టీలకు దాసోహం కావడం అన్యాయమని సీపీఐ చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు.