MLC Jeevan Reddy : పార్టీ నిర్ణయం మేరకే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ : జీవన్ రెడ్డి
కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ(Graduate Mlc) ఎన్నికల్లో పోటీపై పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే నడుచుకుంటానని సిట్టింగ్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి(Jeevan Reddy) స్పష్టం చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ(Graduate Mlc) ఎన్నికల్లో పోటీపై పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే నడుచుకుంటానని సిట్టింగ్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి(Jeevan Reddy) స్పష్టం చేశారు. పోటీ విషయంలో నా వ్యక్తిగత నిర్ణయం అంటూ ఏమి ఉండదన్నారు. నా అభిప్రాయాన్ని రాష్ట్ర నాయకత్వానికి తెలియచేశానని, అదే విషయాన్ని వారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు. టికెట్ విషయమై నాకు ఎవరూ ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. గతంలో కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను నా వ్యక్తిగతంగా పోటీ చేయలేదని, పార్టీ నిర్ణయం మేరకే పోటీ చేసి గెలిచానన్నారు. పార్టీ హైకమాండ్ ఇచ్చిన హామీలతోనే మీరు సెలంట్ అయ్యారన్న ప్రశ్నలకు నాకు అలాంటి హామీలు ఏవీ ఎవరు ఇవ్వలేదన్నారు.
కాగా తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ టీ. జీవన్ రెడ్డి (కాంగ్రెస్), ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి,వరంగల్, ఖమ్మం,నల్లగొండకు చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29న ముగియనున్నది. ఈ తేదీ నాటికి వీరి స్థానాల్లో కొత్త ఎమ్మెల్సీల ఎన్నిక ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. అధికార పార్టీగా ఆ ఎమ్మెల్సీ స్థానాలు హస్తగతం చేసుకోవడం కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరును అధిష్టానానికి పీసీసీ ప్రతిపాదించింది. పోటీకి జీవన్ రెడ్డి నిరారిస్తే ఇతరుల పేరును పరిశీలించేందుకు సీనియర్ మంత్రులతో కమిటీ వేయాలని పీసీసీ నిర్ణయించింది.