లై డిటెక్టర్‌కు సిద్ధమా?.. కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే సవాల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లు జైలుకు వెళ్లాల్సిందే అని మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-03-27 10:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లు జైలుకు వెళ్లాల్సిందే అని మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చాక కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కోసం నవీన్ రావు, శ్రవణ్ రావు సర్వేంట్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారని వివరించారు. ఈ విషయంలో మీ ప్రమేయం లేకపోతే లై డిటెక్టర్‌కు వస్తారా..? అని సవాల్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.


పదేండ్ల పాలనలో ప్రయివేట్ ట్యాపింగ్ యూనివర్సిటీలు ఏర్పాటు చేశారని కీలక ఆరోపణలు చేశారు. శ్రవణ్ రావు, నవీన్ రావు ఫోన్ ట్యాపింగ్‌తో వ్యక్తులను బెదిరించి వందల కోట్లు దండుకున్నారని అన్నారు. ఈ విషయంలో సిట్ వేసి.. లోతైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ధరణిలో కొన్ని వందల ఎకరాలు నవీన్ రావు పేరుపై బదలాయించారని తెలిపారు. నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. చెల్లి కవిత తీహార్ జైలుకు వెళ్తే.. కేటీఆర్ మాత్రం ఎమ్మెల్సీ సీటు కోసం గోవాలో చిందులు వేశాడని విమర్శించారు. అసలు కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత, స్థాయి లేవని అన్నారు. అన్ని బాగున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబెర్స్ పోటీ చేయడం కాదు.. ఇప్పుడు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ముగ్గురు కుటుంబ సభ్యులు మూడు చోట్ల పోటీ చేయాలని సూచించారు.

Tags:    

Similar News