టికెట్ రాలేదన్న బాధేం లేదు.. కానీ ఆయన మాదిగలకు ద్రోహం చేస్తున్నాడు: సంపత్ కుమార్
టీ.కాంగ్రెస్ కీలక నేత, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్‌తో నాగర్ కర్నూలు లోక్‌సభ అభ్యర్థి మల్లు రవి భేటీ అయ్యారు. శుక్రవారం స్వయంగా సంపత్ కుమార్ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.
దిశ, వెబ్‌డెస్క్: టీ.కాంగ్రెస్ కీలక నేత, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్‌తో నాగర్ కర్నూలు లోక్‌సభ అభ్యర్థి మల్లు రవి భేటీ అయ్యారు. శుక్రవారం స్వయంగా సంపత్ కుమార్ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ.. మాదిగల రిజర్వేషన్ విషయంలో కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాజ్యాంగ బద్ధమైన మాదిగల హక్కులను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం మందకృష్ణకు కరెక్ట్ కాదని విమర్శించారు. కేంద్రం 341/A ద్వారా అమైండ్ మెంట్ చేసి రాష్ట్రాలకు నిర్ణయాధికారం కట్టబెట్టాలనేది ఉద్దేశ్యం, దీని విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసింది, ఆ విషయాన్ని స్వయంగా మందకృష్ణే చెప్పారని గుర్తుచేశారు. వర్గీకరణ విషయంలో వేసిన కమిషన్లు అన్నీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వేసినవే అని అన్నారు.
ఉషా మెహ్రా కమిటీ 2005లో వర్గీకరణ కోసం వేసిందే అని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిగలపై వివక్షత చూపింది, ఆ రోజు రేవంత్ రెడ్డి మాత్రమే అసెంబ్లీలో నాతో గొంతు కలిపి వాణిని వినిపించాడని అన్నారు. పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్‌లు మాదిగలకు తీరని ద్రోహం చేశాయని ఆరోపించారు. అలాంటి ద్రోహులతో కలిసి మాదిగ సామాజిక వర్గానికి మందకృష్ణ అన్యాయం చేస్తున్నాడని అన్నారు. మాదిగలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అక్కున చేర్చుకుంది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని తెలిపారు. సర్వే సత్యనారాయణ లాంటి వ్యక్తిని కేంద్రమంత్రిని చేసింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మాదిగలకు సామాజిక న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మందకృష్ణ బీజేపీ ముసుగులో ఉండి మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.
బీజేపీ అగ్రకుల పార్టీ, కాంగ్రెస్ బడుగు, బలహీన వర్గాల పార్టీ అని చెప్పారు. రేవంత్ రెడ్డి సామాజిక స్పృహతో పనిచేస్తున్నాడని కొనియాడారు. నాకు పార్లమెంట్ టికెట్ ఇవ్వకపోయినా బాధలేదని స్పష్టం చేశారు. కానీ, మాదిగ జాతి ప్రయోజనాలను మందకృష్ణ నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడని.. ఈ విషయం సామాజికవర్గ నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీయే తనకు గాడ్ ఫాథర్ అని అన్నారు. మాదిగ జాతికి రాష్ట్రంలో అన్యాయం జరుగుతోందని అనిపించినప్పుడు స్వయంగా అధిష్టానానికి లేఖ రూపంలో తెలియజేస్తానని వెల్లడించారు.