కేటీఆర్ నువ్వో బచ్చా.. మాజీ మంత్రి రవీందర్ నాయక్ ఘాటు వ్యాఖ్యలు

వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలకు వెళ్ళినట్లుగా మాజీ మంత్రి కేటీఆర్ తీరు ఉందని, అలాంటి ఆయన గాంధీ కుటుంబంపై విమర్శలు చేస్తారా? అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రవీందర్ నాయక్ ఘాటు విమర్శలు చేశారు....

Update: 2024-09-29 16:34 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలకు వెళ్ళినట్లుగా మాజీ మంత్రి కేటీఆర్ తీరు ఉందని, అలాంటి ఆయన గాంధీ కుటుంబంపై విమర్శలు చేస్తారా? అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రవీందర్ నాయక్ ఘాటు విమర్శలు చేశారు. అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ నాయకులు వేలాది ఎకరాల భూములు కొల్లగొట్టి, లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. మిగులు బడ్జెట్‌తో సాధించిన తెలంగాణను విధ్వంసం చేసి రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని మండిపడ్డారు. కేసీఆర్.. నోరు విప్పితే కంపు అని రవీందర్ నాయక్ చురకలంటించారు. దళిత సీఎం, భూమి లేని వారికి మూడెకరాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇంటికో ఉద్యోగం, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో ప్రాణత్యాగాలు చేసిన వందలాది కుటుంబాలకు రూ.10 లక్షలు, ఉద్యోగం వంటి ఎన్నూ అబద్ధపు హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శలు చేశారు. ఒడ్డెక్కిందాక ఓడ మల్లన్న దిగినంక బోడ మల్లన్నట్లుగా కేసీఆర్ తీరు ఉందన్నారు. అందుకే ప్రజలు ఆయన్ను ఫాంహౌస్‌కే పరిమితం చేశారని రవీందర్ నాయక్ ఎద్దేవాచేశారు. మహిళలకు ఉచిత బస్స, రూ.500కే గ్యాస్, ఉచిత కరెంట్, ఇతర పథకాలు అందించి మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ అని రవీందర్ నాయక్ కొనియాడారు.


Similar News