Congress: సిగ్గులేకుండా మాట్లడడంలో సిద్ధహస్తుడు.. కేటీఆర్ వ్యాఖ్యలకు టి కాంగ్రెస్ కౌంటర్
దిశ, డైనమిక్ బ్యూరో: కల్వకుంట్ల దొరలు అరచేతికి తేనె పూసి మోచేయి నాకించడంలో సిద్ధహస్తులు అయితే.. సిగ్గులేకుండా మాట్లడడంలో సిద్ధహస్తుడు రామారావు అని తెలంగాణ కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. "మాది నిర్మాణం- మీది విధ్వంసం" అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది. కేటీఆర్ పోస్ట్ చేసిన 'డబుల్ కసరత్తు!' అంటూ ఓ దిన పత్రికలో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేస్తూ దానిపై వివరణ ఇచ్చింది. ఈ సందర్భంగా.. లక్ష ఇండ్లు మీరు నిర్మించారా? ఆశ్చర్యంగా ఉంది కేటీఆర్! అని అన్నది. అలాగే ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై.. యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్ అంటూ.. మీ సగం సగం తెలివికి, సగం సగం పనులకు ఇది సరి తూగుతుందని తెలిపింది.
అంతేగాక ట్విట్టర్ టిల్లు.. పదేళ్ళలో మీరు నిర్మించింది నీ ట్విట్టర్ కూతలోనే స్పష్టంగా కనిపిస్తుందని, కండ్లు పెద్దగా చేసి చదువు కనిపిస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. 2014 నుండి 2023 వరకు 60 వేల ఇండ్లు కూడా పూర్తి చేయలేని చేతగాని దద్దమ్మలు మీరు అని, 2014లో, 2018లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి, గత పదేళ్ళలో లక్ష ఇండ్లు కూడా పూర్తి చేసి పేద ప్రజలకు అందించలేని అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే, అసమర్థ మున్సిపల్ శాఖ మంత్రి నువ్వు అని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక అసంబద్ధంగా ఉన్న ఇండ్లను వృథాగా పోనీయకుండా.. రాజకీయాలకు అతీతంగా, మానవీయ కోణంలో ఆలోచించి పక్కా ప్రణాళికతో నేడు ఇండ్లను పూర్తి చేసి పేదలకు పంచాలని భావించి చర్యలు తీసుకుంటే నీకు కండ్లు మండుతున్నాయని ఫైర్ అయ్యింది.
ఈరోజు మా ప్రభుత్వం నగర అభివృద్ధిలో భాగంగా పర్యావరణ రక్షణ కోసం, భవిష్యత్ నీటి అవసరాల కోసం, వరదల నుండి, కరువు పరిస్థితులను ఎదుర్కోవడం కోసం మూసి నదీ ప్రక్షాళన చేసి, ఉపాధి, పర్యాటక అవకాశాలు పెంచడం కోసం కృషి చేస్తుందని చెప్పారు. దీనిపై సిగ్గు తప్పి మాట్లాడానికి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా.. అది మీ గొప్పతనంగా భావించడం చూస్తుంటే అధికారం పోయిన భాధతో, నాడు మంత్రిగా అధికారంలో ఉండి నీ సినిమా దోస్తుల దగ్గర నువ్వు వేసే వేషాలు నేడు లేకపోవడంతో నీకు మతి స్థిమితంగా లేనట్టుందని అన్నది. అంతేగాక మీ బీఆర్ఎస్ లో ఉన్న డాక్టర్ల సలహా తీసుకొని, వచ్చి గాంధీ లేదా ఉస్మానియా హాస్పిటల్ లో అడ్మిట్ అయితే, మీ పదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసం స్పష్టంగా కనిపిస్తుందని టి కాంగ్రెస్ రాసుకొచ్చింది.