దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోసు బాధితులు దొరకడం లేదు. ఇప్పటి వరకు రెండో డోసు పొందాల్సిన వారిలో 87% మంది టీకాలు వేసుకోగా, మరో 13% మందికి రెండో డోస్ పూర్తి కాలేదు. వీరి కోసం టీమ్‌లు రాష్ట్రాన్ని జల్లెడ పడుతున్నాయి. రెండో డోస్ వేయించుకోవాల్సిన గడువు ముగిసినా సదరు వ్యక్తులు ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం. డోసులు ఇచ్చేందుకు టీమ్‌లు తిరుగుతున్నా లాభం లేదు. రెండో డోస్ లబ్ధిదారులు లభించడం లేదని క్షేత్రస్థాయిలో ఉండే ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు వాపోతున్నారు. తప్పుడు అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు ఇవ్వడం కారణంగానే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నట్లు ఆఫీసర్లు పేర్కొంటున్నారు.
కానీ వ్యాక్సినేషన్ ప్రక్రియలో చాలా టెక్నికల్ సమస్యలు వచ్చాయి. టీకా తీసుకోకపోయినా వేసుకున్నట్లు, కేవలం మొదటిది పొందిదే రెండు, డబుల్ టీకాలు తీసుకున్నా అసలు మెస్సేజ్‌లు రాకపోవడం వంటి చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో జనాల్లో కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ క్రమంలో చాలామంది టీకాల ప్రక్రియలో ఇబ్బంది పడ్డారు. జనసాంద్రత ఎక్కువగా ఉండటం వలన పట్టణాల్లోనే ఈ సమస్య వేధిస్తోంది.
హైదరాబాద్‌లో 80 శాతమే..
కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లో రెండు డోసుల్లో 100% టీకా పంపిణీ పూర్తి కాగా, హైదరాబాద్‌లో మాత్రం ఇప్పటి వరకు కేవలం 80% మంది మాత్రమే రెండో డోసు పొందారు. ఇక యాదాద్రి, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, జనగామ, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట , జగిత్యాల , నల్లగొండ, మంచిర్యాల జిల్లాల్లో సగటున 90% చొప్పున రెండో డోస్ వ్యాక్సినేషన్ పూర్తి కాగా, మహబూబ్ నగర్ , భద్రాద్రి, భూపాలపల్లి, వరంగల్, సూర్యాపేట, నిర్మల్, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, నిజామాబాద్, మేడ్చల్ జిల్లాల్లో సగటున 85 శాతం చొప్పున రెండో డోసు పూర్తయింది. వనపర్తి, వికారాబాద్ , కొమురం భీం జిల్లాల్లో రెండో డోసు పంపిణీ వెనక పడింది.
15 నుంచి 17 ఏళ్లల్లో స్పీడ్
రాష్ట్ర వ్యాప్తంగా టీనేజర్ల టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఏకంగా 72% మందికి వ్యాక్సిన్ పంపిణీ పూర్తయింది. హన్మకొండలో 100% పూర్తి కాగా, మహబూబ్‌నగర్ , ఖమ్మం, నారాయణపేట, వనపర్తి, సిరిసిల్ల, సంగారెడ్డి, కొత్తగూడెం, గద్వాల్ జిల్లాల్లో సగటున 90 శాతం చొప్పున వ్యాక్సినేషన్ జరిగింది. అతి తక్కువగా రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 51 శాతం మంది మాత్రమే టీకా పొందడం గమనార్హం.