తెలంగాణ కాంగ్రెస్‌లో సీడబ్ల్యూసీ పదవుల కోసం పోటీ!
తెలంగాణ కాంగ్రెస్‌లో సీడబ్ల్యూసీ పదవులు నాయకుల మధ్య చిచ్చురాజేయబోతోందా? తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్లు రవి వ్యాఖ్యలను చూస్తే అవుననే అనిపిస్తోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‌లో సీడబ్ల్యూసీ పదవులు నాయకుల మధ్య చిచ్చురాజేయబోతోందా? తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్లు రవి వ్యాఖ్యలను చూస్తే అవుననే అనిపిస్తోంది. తనకు పీసీసీ పదవి విషయంలో అన్యాయం జరిగింది కాబట్టి సీడబ్ల్యూసీలో తనకు న్యాయం చేస్తారని భావిస్తున్నట్లు కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు అనంతరం మల్లు రవి కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. సీడబ్ల్యూసీలో తనకూ అవకాశం వస్తుందని భావిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఉంటే పోటీ చేద్దామనుకున్నానని అయితే ఎన్నికలు నిర్వహించకూడదని తీర్మానం చేసిన నేపథ్యంలో నామినేటెడ్ గా తనకు అవకాశం వస్తుందనుకుంటున్నట్లు చెప్పారు.
ఈ పదవి కోసం తనకు అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై తాను స్పందించనని అన్నారు. ఇప్పటికే పీసీసీ పదవుల విషయంలో నాయకలు మధ్య విభేదాలు తారా స్థాయికి చేరిన నేపథ్యంలో సీడబ్ల్యూసీ పదవులు పంచాయతీ ఏ తీరానికి చేర్చుతుందో అనేది పార్టీ శ్రేణుల్లో చర్చగా మారింది. ప్లీనరి వద్ద శ్రీధర్ బాబు స్పందిస్తూ సోనియా కామెంట్స్ బీజేపీకి చెంప పట్టులాంటిదన్నారు. కింది స్థాయి కార్యకర్త కూడా పార్టీని నడిపించగలరని సోనియా నిరూపించారని సీడబ్ల్యూసీ ఎన్నికలపై అధిష్టానం మంచి నిర్ణయం తీసుకుందని అన్నారు.