CM Revanth: రహస్యంగా ఉండాల్సిన ఆ విషయం దేశం దాటింది.. వాళ్లు ఒక్క క్లిక్ చేస్తే అంతే సంగతి

తెలంగాణ రెవెన్యూ శాఖ(Revenue Department), ముఖ్యమంత్రి మధ్య ఉండాల్సిన సమాచారం ఇతర దేశాలకు వెళ్లిందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆరోపించారు.

Update: 2024-12-20 10:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రెవెన్యూ శాఖ(Revenue Department), ముఖ్యమంత్రి మధ్య ఉండాల్సిన సమాచారం ఇతర దేశాలకు వెళ్లిందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆరోపించారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. మన భూములకు సంబంధించిన పూర్తి సమాచారం ఇతర దేశాల్లో స్థిరపడిన ప్రముఖుల వద్ద ఉన్నదని అన్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన కంపెనీల ద్వారా డేటాను దేశం దాటించారని మండిపడ్డారు. ప్రజల్ని మోసం చేసి సమాచారం అంతా క్రిమినల్స్‌కు అందించారని అన్నారు. ఈ నేరాలకు ఏం శిక్ష విధించాలో తెలియాలంటే చట్టాలన్నీ చదవాలని కీలక వ్యాఖ్యలు చేశారు. డజన్ల కొద్ది కంపెనీలు ధరణి(Dharani)లోకి ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. ఇవన్నీ తాము ఎన్నికల ముందు చెబితే తమను బంగాళాఖాతంలో కలపాలని మాట్లాడారని గుర్తుచేశారు.

అందుకే తాము అధికారంలోకి వచ్చాక ధరణిని బంగాళాఖాతంలో కలిపామని స్పష్టం చేశారు. ఇన్ని అవకతవకలు ఉన్నా ధరణి అద్భుతం అంటూ ఎన్నికల్లో గొప్పలకు పోయి ప్రసంగాలు చేశారని విమర్శించారు. ధరణి పేరుతో బీఆర్ఎస్(BRS) నేతల అరాచకం, దుర్మార్గం చెప్పలేని స్థాయికి వెళ్లిందని అన్నారు. ధరణి నిర్వహణలో ఎలాంటి మార్పులు చేయాలన్నా ప్రభుత్వ అనుమతి ఉండాలని.. ధరణి సాఫ్ట్వేర్‌లో ఏ మార్పు చేయాలన్నా ప్రభుత్వ ఆఫీసులోనే ఉండి పనిచేయాలని.. కానీ నిబంధనలు ఉల్లంఘించి కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయని ఆరోపించారు. ధరణి పోర్టల్‌(Dharani Portal)ను వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ఆపరేట్ చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మి భూములకు సంబంధించిన వివరాలు ఇస్తే.. ప్రయివేట్ వ్యక్తులకు సమాచారం అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా పౌరుల వ్యక్తిగత సమాచారం సేకరించడం నేరం. వ్యక్తిగత సమాచారం ఎవరికీ ఇవ్వకూడదని చట్టాలు చెబుతున్నాయి.

కానీ గాదె శ్రీధర్ రాజు(Gade Sridhar Raju) ద్వారా బీఆర్ఎస్ హయాంలో సమాచారాన్ని దేశాలు దాటించారని అన్నారు. వాళ్లు ఒక్క క్లిక్ కొడితే సమాచారం మొత్తం నాశనం అయిపోతుందని తెలిపారు. మన దగ్గర ఉన్న సర్వర్లు కూడా క్రాష్ అవుతాయని అన్నారు. అందుకే విచారణకు ఇవ్వడంపై ఇంతకాలం ఆలోచన చేసినట్లు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అర్ధరాత్రి కూడా రిజిస్ట్రేషన్లు జరిగాయని గుర్తుచేశారు. అసలు అర్ధరాత్రుళ్లు రిజిస్ట్రేషన్లు చేసే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఇవన్నీ బయటపడుతాయనే అసెంబ్లీలో అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. కిషన్ రెడ్డి సొంతూరులో కూడా భూదాన్ భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కిషన్ రెడ్డి ఫిర్యాదు చేసిన తర్వాత కూడా భూముల బదలాయింపు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే వాటిపై కేసులు నమోదు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News