CM Revanth Reddy: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. తాగునీటి అంశంలో సీఎం కీలక ఆదేశాలు

హైదరాబాద్ నగర వాసుల నీటి కష్టాలను తొగలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది.

Update: 2024-11-23 09:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగర ప్రజల తాగునీటి కష్టాలకు (Hyderabad Drinking Water) చెక్ పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వేగం పెంచింది. నగర తాగునీటి అంశంపై శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో జలమండలి, ఇరిగేషన్ ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో జరిగిన ఈ మీటింగ్ లో హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపుపై సీఎం సమీక్షించారు. కొండపోచమ్మ (Konda Pochamma Project), మల్లన్న సాగర్ (Mallanna Sagar) ప్రాజెక్టుల నుంచి నీటి తరలింపుపైన సమగ్ర నివేదిక తయారు చేయాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు. ఏ ప్రాజెక్టు నుంచి నీటి తరలింపునకు ఎంత వ్యయం అవుతుంది, నీటి లభ్యతపైనపూర్తి అధ్యయనం చేయాలని, రాబోయే డిసెంబర్ 1వ తేదీ వరకు టెండర్లకు వెళ్లేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ సెక్రటరీ ప్రశాంత్ జె.పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

కాగా మూసీ ప్రక్షాళనతో పాటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పునరుజ్జీవనం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. ఈ మేరకు నగర తాగునీటి అవసరాలు తీర్చేందుకు గోదావరి మంచినీటి సరఫరా ఫేజ్-2కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ సైతం ఇచ్చింది. మల్లన్న సాగర్ నుంచి నీటిని తరలించాలని నిర్ణయిస్తూ ఇందుకోసం రూ. 5,560 కోట్లను పురపాలక శాఖ ఇప్పటికే జీవో నంబర్ 345 ను జారీ చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News