ఆరోజు నుంచే రాష్ట్రంలో భూభారతి అమలు.. CM రేవంత్ అధికారిక ప్రకటన
తెలంగాణలో భూభారతి(Bhu Bharathi) అమలుకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 14వ తేదీ నుంచి అమలు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో భూభారతి(Bhu Bharathi) అమలుకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 14వ తేదీ నుంచి అమలు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో భూభారతి అమలుపై సంబంధిత మంత్రి, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా భూభారతి అమలు చేయబోతున్నట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే మూడు మండలాలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టులో ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ప్రజలకు సౌకర్యంగా ఉండేలా భూభారతి రూపొందించినట్లు తెలిపారు. అంతేకాదు.. భూభారతి పోర్టల్‌పై రాష్ట్రంలోని ప్రతీ మండలంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని ప్రకటించారు. అవగాహన సదస్సుల బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించారు. ఇదిలా ఉండగా.. ఆర్వోఆర్-2020 స్థానంలో ఆర్వోఆర్-2025 ‘భూభారతి’ చట్టాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అమల్లోకి తీసుకురానున్నారు. దీంతోపాటు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు-మ్యుటేషన్ల ఫోర్టల్ ‘ధరణి’ స్థానంలో భూ-భారతి పోర్టల్ సైతం అందుబాటులోకి రానుంది. ఈ నెల 14న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి చేతులు మీదుగా నూతన చట్టం, పోర్టల్‌ను ఆవిష్కరించేందుకు రెవెన్యూశాఖ ఏర్పాట్లు చేస్తోంది. కొత్త చట్టం అమలు, నియమ.. నిబంధనలపై అదే రోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.