గవర్నర్‌‌తో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కేబినెట్ విస్తరణపై కీలక చర్చ!

రాజ్‌భవన్‌‌లో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. గవర్నర్‌కు సీఎం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

Update: 2025-03-30 08:25 GMT
గవర్నర్‌‌తో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కేబినెట్ విస్తరణపై కీలక చర్చ!
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: రాజ్‌భవన్‌‌లో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Governor Jishnu Dev Verma)తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భేటీ ముగిసింది. గవర్నర్‌కు సీఎం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సీఎంతో పాటు మంత్రి కొండా సురేఖ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ భేటీలో (Cabinet expansion) మంత్రి వర్గ విస్తరణపై గవర్నర్‌తో చర్చించినట్లు కన్పిస్తోంది. కేబినెట్ విస్తరణపై గవర్నర్ సమయం కోరినట్లు టాక్ నడుస్తోంది. ఇక ఏప్రిల్‌ 3న మంత్రి వర్గ విస్తరణ ఉండే చాన్స్‌ ఉంది. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా.. ఇందులో నాలుగింటిని భర్తీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేబినెట్‌లో నలుగురికి చోటు కల్పించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఉగాది తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని జోరుగా ప్రచారం జరుగడంతో ఆశావహులు అలర్ట్ అయ్యారు. మరోవైపు ఆశావహుల పేర్లను అధిష్టానానికి పంపినట్టు ప్రచారం జరుగుతోంది. తమ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని మాదిగ, లంబాడి, బీసీ సామాజికవర్గ ఎమ్మెల్యేలు గతంలో అధిష్టానానికి లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్, పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌లకు తమ వినతులను మెయిల్, ఫ్యాక్స్ ద్వారా పంపారు. రాష్ట్రంలో మాదిగ జనాభా దాదాపు 48 లక్షల మంది ఉన్నారు. కానీ, ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఎస్టీ జనాభాలో లంబాడాలు అధిక శాతం ఉన్నారంటూ లంబాడాలు కూడా విస్తరణలో తమకు అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి.

కేబినెట్ విస్తరణలో భాగంగా బీసీ, ఎస్సీ, మైనార్టీ, రెడ్డి సామాజిక వర్గాలకు ఒక్కో పదవి ఇచ్చే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవులు దక్కని వారికి డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు గాంధీభవన్ వర్గాల సమాచారం. ప్రస్తుత మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, నిజామాబాద్ నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి సైతం తమకు అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News