దుమారం రేపుతోన్న ఎమ్మెల్యేల రహస్య భేటీ న్యూస్.. CM రేవంత్‌కు నాయిని రాజేందర్ రెడ్డి లేఖ
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల(Congress MLAs) రహస్య భేటీ వార్త తీవ్ర దుమారం రేపింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల(Congress MLAs) రహస్య భేటీ వార్త తీవ్ర దుమారం రేపింది. ఈ అంశంపై విపక్ష నేతలతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం స్పందించారు. బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్‌లో కల్లోలం మొదలైందని మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పందిస్తూ ఖండించారు. తాజాగా ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(Naini Rajender Reddy) స్పందించారు. ఎమ్మెల్యేల రహస్య భేటీ వార్తలను ఖండించారు. ఉద్దేశ పూర్వకంగానే కొందరు ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.. కుట్ర వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదు.. పరువు నష్టం దావా వేస్తా.. యూట్యూబర్స్(YouTubers)పై చట్టపరమైన చర్యలు తీసుకుంటా అని నాయిని రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు అందరూ ఒకచోట చేరి అభివృద్ధిపై చర్చిస్తే తప్పేముంది అని అన్నారు. ఈ విషయంపై ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తా అని వెల్లడించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి లేఖ రాశారు. తాను భేటీలో పాల్గొనలేదని లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు కాంగ్రెస్ప్రభుత్వంపై తిరుగుబాటు అంటూ సోషల్ మీడియా చేసిన దుమారంతో తెలందాణ కాంగ్రెస్ ఉలిక్కిపడి అలర్ట్ అయ్యింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ కావడం వెనుకున్న శక్తులపై ఆరా తీసింది. ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డితో టీపీసీసీ చీఫ్మహేశ్ కుమార్ గౌడ్ తాజాగా ఫోన్‌లో మాట్లాడారు. ఇలాంటి సమావేశాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏర్పాటు చేయడం సరికాదని హితవు పలికారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి లేదా.. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మరోవైపు ఆ సమావేశానికి ఎవరూ హాజరుకాలేదంటూ మీడియాకు కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. తమ ప్రభుత్వంపై ప్రత్యర్థి పార్టీల సోషల్‌మీడియా వేదికగా విష ప్రచారం చేస్తున్నాయని ఆరోపించింది.