దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ఎన్నికల ఆరు గ్యారంటీల(Six guarantees) హామీల్లో కీలకమైనది ఇందిరమ్మ ఇళ్ళు(Indiramma Houses). సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆధ్వర్యంలో ఇప్పటికే ఈ హామీ అమలుపై కసరత్తులు జరుగుతున్నాయి. ఇదివరకే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై ఇందిరమ్మ కమిటీలు(Indiramma Committees) ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఇక ఇళ్ల పంపిణీపై శ్రద్ధ పెట్టింది. అందులో భాగంగా శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy), ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు విధి విధానాలు, లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలో తీసుకోవాల్సిన చార్యలలు, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమిలేని వారు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్యక్రమం ఎంచుకోవాలని అన్నారు. తొలి దశలో సొంత స్థలాలున్న వారికే ప్రాధాన్యమిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయడంతో పాటు అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.