CM Revanth Reddy: ప్రభుత్వం పై నమ్మకం ఉంది. సీఎంతో భేటీ అనంతరం ఉద్యోగ జేఏసీ నేతలు

ప్రభుత్వం పై నమ్మకం ఉందని సీఎంతో భేటీ అనంతరం ఉద్యోగ జేఏసీ నేతలు అన్నారు.

Update: 2024-10-24 13:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తుందనే నమ్మకం ఉందని, బదిలీలు, సర్వీసు అంశాలను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలంగాణ ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు అన్నారు. ఇవాళ బంజారాహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో టీజీవో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జేఏసీ ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో సీఎం దాదాపు 3 గంటల పాటు ఉద్యోగ సంఘాలతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జేఏసీ నేతలు.. తమ సమస్యలను సీఎం క్షుణ్ణంగా విన్నారని ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, ఆర్థిక సంబంధమైన సమస్యలను ఆర్థిక శాఖ మంత్రితో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని చెప్పారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా డీఏ విషయంలో ఆర్థిక మంత్రితో చర్చించి రేపు సాయంత్రం వరకు ప్రకటన చేస్తామన్నారని తెలిపారు. ట్రాన్స్‌ఫర్లు, ప్రమోషన్ల విషయంలోనూ సానుకూలంగా స్పందించారన్నారు.

ఆ జేఏసీ మాటలు ఉద్యోగులు నమ్మొద్దు...

తమ డిమాండ్ల సాధనలో ఇది మొదటి మెట్టు ఉద్యోగులు పేర్కొన్నారు. 317 జీవో అంశంపై ప్రస్తుతం సబ్ కమిటీ పని చేస్తున్నందున జేఏసీ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారన్నారు. ఆర్థిక పరమైన అంశాలపై ఓ కమిటీని వేయబోతున్నట్లు సీఎం వెల్లడించారన్నారు. త్వరలో మరోసారి జేఏసీతో భేటీ అవుతానని చెప్పారన్నారు. ‘నేను మీ కుటుంబ సభ్యుడినని, మీ అన్నలాంటి వాడిని, మీ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, ఆందోళన అక్కర్లేదు’ అని భరోసా ఇచ్చారని ఉద్యోగులు తెలిపారు. ఉద్యోగులు, ఉద్యోగసంఘాలపై తమ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు తీసుకోబోమని చెప్పారన్నారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం స్పష్టమైన హామీ ఇచ్చినందున మధ్యవర్తులను, వేరే జేఏసీ పేరుతో మాట్లాడుతున్నవారి మాటలను ఉద్యోగులు నమ్మవద్దని కోరారు. వేరే శాఖల్లోకి వెళ్లిన వీఆర్వోలను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకుంటామని సైతం సీఎం చెప్పారన్నారు.


Similar News