కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సంచలన సవాల్

ప్రధాని మోడీపైనా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపైనా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు.

Update: 2024-04-06 17:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీపైనా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపైనా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. పదేండ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దోపిడీ దొంగల్లా దోచుకుంటే ప్రధాని మోడీ మాత్రం ప్రాంతాలు, రాష్ట్రాలు, ప్రజల మధ్య చిచ్చుపెట్టి విభజన తెచ్చారని అన్నారు. పదేండ్లలో తెలంగాణ రాష్ట్రానికి విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కూడా మోడీ నెరవేర్చలేదన్నారు. తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నా హైదరాబాద్ వరదలు వస్తే ఒక్క పైసా కూడా తెప్పించలేకపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారంటూ బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. డబుల్ ఇండ్లు కట్టించిన చోట బీఆర్ఎస్ ఓట్లు అడగాలని, ఇందిరమ్మ ఇండ్లు ఉన్నచోట కాంగ్రెస్ ఓట్లు అడుగుతుందని, ఎవరికి ప్రజలు పట్టం కడతారో చూద్దామని కేసీఆర్‌కు సవాలు విసిరారు. తుక్కుగూడలో జరిగిన జనజాతర సభలో సీఎం రేవంత్ పై వ్యాఖ్యలు చేశారు.

“నిన్నమొన్న కొన్ని కుక్కలు మొరిగినయి.. నిన్న ఒక నక్క బయలుదేరింది.. ఈ మధ్య సూర్యాపేట పోయింది.. నిన్న కరీంనగర్ పోయింది.. నన్ను ఏం పీకుతరని కేసీఆర్ అంటున్నడు.. ఆయన మాటలు వినే ఉంటారు.. నా వెంట్రుక కూడా పీకలేడని అన్నాడు.. మాజీ సీఎం హోదాలో మాట్లాడే భాషేనా అది..? భాష, భావం, ప్రజల సమస్యల గురించి మాట్లాడే కేసీఆర్.. పదేండ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించి, వేధించాడు. దోపిడీ దొంగల్లాగా, అడవి పందుల్లాగా దోచుకుని రాష్ట్రాన్ని వందేండ్లలో జరిగే విధ్వంసాన్ని పదేండ్లలోనే చేసి సర్వనాశనం చేశాడు. మా కార్యకర్తలు అనుకుంటే కేసీఆర్ ము... మీద డ్రాయర్ కూడా ఉండదు” అని రేవంత్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

“నువ్వు అనుకుంటున్నవేమో.. కాలు విరిగిందని, లేదా కట్టె పట్టుకుని నడుస్తున్నవని, కూతురు జైల్లోకి పోయిందని, బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని.. కొంతకాలం మేం సంయమనం పాటించాం.. కష్టం వచ్చినప్పుడు మానవత్వంతో మాట్లాడకుండా మర్యాదగా వ్యవహరించాం.. ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటమని అనుకోవద్దు.. ఊరుకోడానికి నేను పెద్దలు జానారెడ్డి లాంటివాడిని కాను.. రేవంత్ రెడ్డిని..” అని రేవంత్ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.

ఊరుకోడానికి ఎవ్వడూ సిద్ధంగా లేడని చెప్తూనే.. అంగీ లాగు ఊడబీకి మాట్లాడే లత్కోర్ లఫంగి మాటలకు చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్త బిడ్డా.. అంటూ హెచ్చరించారు. ఆనాడు చెప్పాను.. ఈనాడూ చెప్తున్నా.. పేదలకు కేసీఆర్ డబుల్ ఇండ్లు కట్టివ్వలే.. నేను మాత్రం చర్లపల్లి జైల్లో కట్టిస్తా.. కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు వస్తే ఏడ ఉండాలె అని అన్నవ్.. ఇప్పుడు అందరూ కలిసి చర్లపల్లి జైలలో ఉండేటట్టు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తా.. మీరందరూ అక్కడే ఉండండి.. మా కార్యకర్తలు కట్టిచ్చే బాధ్యతను తీసుకుంటారు.. అని రేవంత్ ఈ సభా వేదిక ద్వారా కేసీఆర్‌ను హెచ్చరించారు.

అబద్ధాలతో మోడీ పదేండ్ల పాలన:

బీజేపీపైనా, ప్రధాని మోడీపైనా సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఒక్క అవకాశం ఇవ్వాలంటూ బీజేపీ కోరుతున్నదని, కానీ ఆ పార్టీకి మరోసారి ఎందుకు అవకాశం ఇవ్వాలని ప్రశ్నించారు. ప్రతీ సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని మాట ఇచ్చిన ప్రధాని మోడీ ఎన్ని ఇచ్చారని ప్రశ్నించారు. ఇప్పటికి పదేండ్లలో మొత్తం 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండెనని, కానీ ఇచ్చినవి కేవలం 7 లక్షల ఉద్యోగాలేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటు వేదికగా ఈ లెక్కలు చెప్పిందన్నారు. లక్షలాది మది రైతులు ఢిల్లీ సరిహద్దులో ధర్నా చేస్తే 750 మంది రైతులు చనిపోడానికి ప్రధాని మోడీ కారణమయ్యారని ఆరోపించారు. కనీసం ఆ కుటుంబాలను ప్రధాని ఆదుకోలేదని, బాధిత కుటుంమ సభ్యులను పరామర్శించలేదన్నారు. ఈ ఘనకార్యం చేసినందుకు బీజేపీకి ఓటు వేయాలా అని ప్రశ్నించారు.

‘నమో’ అంటే నమ్మితే మోసం..:

ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టిస్తానన్న ప్రధాని మోడీ తెలంగాణలో ఎన్ని ఇండ్లు ఇచ్చారో చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. ప్రాంతాలు, ప్రజలు, రాష్ట్రాల మధ్య మోడీ చిచ్చుపెట్టి విభజించి పాలించి ఇంతకాలం అధికారాన్ని కాపాడుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు మూడోసారి ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య చిచ్చుపెట్టి విభజన పాలటిక్స్ తో వస్తున్నారని, నమ్మి మోసపోవద్దన్నారు. హైదరాబాద్ నగరానికి వరదలు వస్తే ప్రధాని మోడీ, కిషన్ రెడ్డి ఒక్క పైసానైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని నిలదీశారు. ‘నమో’ అంటే నమ్మితే మోసం అని రేవంత్ వ్యాఖ్యానించారు. బీజేపీకి ఇప్పుడు ఓటు వేస్తే మోడీ చంద్ర మండలానికి రాజు అవుతాడా? అని ప్రశ్నించారు.

పదేండ్లలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు:

కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని సీఎం రేవంత్ అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోడీ తెలంగాణలోని పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు... ఐటీఐఆర్ ఇవ్వలే... రైల్వే కోచ ఫ్యాక్టరీ ఇవ్వలే... బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలే... విభజన చట్టంలోని హామీలనూ అమలు చేయలేదని సీఎం రేవంత్ ఆరోపించారు. తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రకు తాకట్టు పెట్టారని, నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే వాటిని మళ్ళీ తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో బొంద పెట్టినట్లే లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీని బొంద పెట్టేవరకు నిద్ర పోవద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

వంద రోజుల పాలనే మాకు భరోసా:

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన పథకాలు, వంద రోజుల పాలనే గెలిపిస్తుందని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో 22 లక్షల ఇందిరమ్మ ఇండ్లు పేదలకు దక్కాయని, ఇప్పుడు మరోసారి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, నాలుగున్నర లక్షల ఇండ్లను రూ. 22,500 కోట్లతో కట్టిస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లాలో ఈ స్కీమ్‌ను మొదలుపెట్టామని, చెప్పిన మేరకు ఇండ్లను కట్టించి తీరుతామన్నారు. “ఇందిరమ్మ ఇండ్లు ఉన్న ఊళ్లలో మేం ఓట్లు అడుగుతాం.. డబుల్ ఇండ్లు ఉన్న ఇండ్లలో మీరు (బీఆర్ఎస్‌ను ఉద్దేశించి) ఓట్లు అడగాలి.. ఇదే బీఆర్ఎస్‌కు నా సవాల్” అని రేవంత్ వ్యాఖ్యానించారు.

వంద రోజుల్లో తమ పార్టీ పరిపాలనను ప్రజల ముందు పెట్టామని, ఇచ్చిన హామీలను అమలు ఛేశామని, ఒకవైపు సంక్షేమం, మరోవైపు ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేశామన్నారు. “ఒకవేళ మా పాలన సరిగా లేకపోతే మాకు ఓటు వేయకండి. దీన్ని మీరు (ప్రజలను ఉద్దేశించి) ఆలోచన చేయండి. నిజాయితీగా కడుపు కట్టుకుని 18 గంటలు పనిచేస్తున్నాం... తెలంగాణ సమాజానికి భవిష్యత్తులో మంచి పాలన అందించాలని, ఢిల్లీ నుంచి నిధులు, అనుమతులు తెచ్చుకోవాలని 14 పార్లమెంటు స్థానాల కోసం కొట్లాడుతున్నాం. దేశానికి రాహుల్‌ను ప్రధానిని చేయాలి.

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4 వేల కి.మీ. మేర మండుటెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేశాడు.. మణిపూర్ నుంచి ముంబై వరకు 6700 కి.మీ. 25 రాష్ట్రాల్లో ప్రజల కోసం నడిచాడు. ఇలాంటి నాయకుడు ప్రధాని కావాలి.. విదేశీ ప్రయాణాలు, డ్రెస్సులు మార్చే మోడీ కావాలో..? ప్రజల కోసం పనిచేసే రాహుల్‌ కావాలో..? యువత ఆలోచించాలని రేవంత్ కోరారు. దేశం కోసం త్యాగం చేసిన గాంధీ పరివార్ తమదని, దీన్ని గర్వంగానే చెప్పుకుంటామన్నారు. ఐటీ, ఈడీ, సీబీఐ సంస్థలు మోడీ పరివార్ అని వ్యాఖ్యానించారు.

జూన్ 9న కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం:

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని, జూన్ 9న ఢిల్లీ ఎర్రకోట మీద జెండా ఎగరేయడం తథ్యమని సీఎం రేవంత్ అన్నారు. తుక్కుగూడ సభ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను తుక్కుతుక్కుగా ఎట్లా తొక్కారో ఇప్పుడు అదే ఉత్సాహం, పట్టుదల, ఊపుతో అదే తుక్కుగూడ వేదికగా బీజేపీని తుక్కుతుక్కుగా తొక్కడానికి సునామీలాగా ఇక్కడికి వచ్చిన ప్రజలు రాహుల్‌ను ప్రధాని చేయాలని కోరారు. ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని, తెలంగాణ స్ఫూర్తితో వైబ్రంట్ తెలంగాణ నినాదంతో జాతీయ స్థాయిలో మోడీ చెప్తున్న గుజరాత్ మోడల్ మీద ఆధిపత్యాన్ని చూపిస్తామన్నారు. అభివృద్ధి పథం వైపు దేశాన్ని నడిపించేది కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు.


Similar News