సహకారం అందిస్తాం.. సీఎం రేవంత్‌కు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ హామీ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్కిల్ యూనివర్శిటీకి అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తామని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా హామీ ఇచ్చారు.

Update: 2024-09-27 16:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్కిల్ యూనివర్శిటీకి అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తామని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా హామీ ఇచ్చారు. గత కొన్నేళ్ళుగా యువతకు ప్రత్యేకమైన నైపుణ్యాలను, ప్రావీణ్యాలను కల్పించడానికి ‘గువి’ అనే సంస్థ ద్వారా టెక్నికల్ కోర్సుల్ని నిర్వహించి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని, తెలంగాణలోనో ఆ ప్లాట్‌ఫామ్ ద్వారా సహకారం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి స్పష్టం చేశారు. సచివాలయంలో శుక్రవారం వీరిద్దరి మధ్య జరిగిన భేటీలో రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పుతున్న స్కిల్స్ యూనివర్శిటీ అంశం చర్చకు వచ్చింది. ఈ యూనివర్శిటీ లక్ష్యాన్ని, భవిష్యత్తులో యువతకు లభించనున్న ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై ఆమెకు సీఎం వివరించారు. హైటెక్ సిటీలో హెచ్‌సీఎల్ నెలకొల్పుతున్న కొత్త క్యాంపస్ గురించి ముఖ్యమంత్రికి వివరించిన రోష్నీ నాడార్... దీంతో సుమారు ఐదు వేల మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఈ క్యాంపస్‌ను ప్రారంభించాల్సిందిగా సీఎంను ఆమె రిక్వెస్టు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న విద్య, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ఆమెకు సీఎం వివరించారు. విద్యార్థులకు మెరుగైన శిక్షణతో పాటు, విద్యా వనరులను విస్తరించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో హెచ్‌సీఎల్ భాగస్వామ్యం ఉండాలన్న తన ఆకాంక్షను ఆమెతో పంచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది యువకులకు ప్రయోజనం చేకూర్చే నైపుణ్యాభివృద్ధికి హెచ్‌సిఎల్‌తో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉపాధి అవకాశాల కల్పనకు హెచ్సీఎల్ చేస్తున్న కృషిని అభినందించి ఇకపైనా రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందని నొక్కిచెప్పారు. హెచ్‌సీఎల్ వ్యూహత్మక భాగస్వామ్యం యువతకు ఉద్యోగాలను కల్పించటంతో పాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రోష్నీ నాడార్.. రాష్ట్రంలో యువతకు నైపుణ్యాలను నేర్పించి సాధికారత కల్పించేందుకు చేపట్టే కార్యక్రమాల్లో తమ భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉపాధి అవకాశాలతో పాటు సాంకేతిక సామర్థ్యాలను హెచ్‌సీఎల్ సంస్థతో పాటు దాని ఆధ్వర్యంలోనే పనిచేస్తున్న ‘గువి’ పెంపొందిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో తమ కంపెనీ భాగస్వామ్యం పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను నేర్పించి యువతకు సాధికారత కల్పించడానికి, ఉపాధి అవకాశాలు పొందడానికి దోహదపడుతుందని వివరించారు. ఔత్సాహిక సాంకేతిక నిపుణులను తయారు చేసి వారికి తగిన ప్లేస్‌మెంట్ లభించేందుకు ఉపకరిస్తుందన్నారు. స్కిల్ యూనివర్శిటీతో పాటు హెచ్‌సిఎల్ విద్యా కార్యక్రమాలను తెలంగాణలో ఉన్న ఇతర విశ్వవిద్యాలయాలకు విస్తరించే ప్రణాళికలు, దీంతో ఎక్కువ మంది లబ్ధి పొందుతారనే ఆలోచనలను కూడా ఈ సమావేశంలో ఆమె పంచుకున్నారు. రెండేండ్ల కిందటే హెచ్‌సీఎల్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ సంస్థ ‘గువి’ని ఏర్పాటు చేసి నైపుణ్య విభాగంగా సర్వీసులను ప్రారంభించిందని, ప్రాంతీయ భాషల్లోనే టెక్నికల్ కోర్సులను నిర్వహిస్తున్నదని ఆమె వివరించారు. సాంకేతిక విద్యలో భాషాపరమైన అవరోధాలను తొలిగించేందుకు ‘గువి’ కృషి చేస్తున్నదని సీఎం రేవంత్‌కు రోష్నీ నాడార్ వివరించారు.


Similar News