బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ గిఫ్ట్.. త్వరలోనే అధికారిక ప్రకటన
దుబ్బాక త్వరలో రెవెన్యూ డివిజన్‌గా మారనున్నది. గత వారం సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సీఎంను కలిశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక త్వరలో రెవెన్యూ డివిజన్‌గా మారనున్నది. గత వారం సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సీఎంను కలిశారు. దుబ్బాకను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేయాలని రిక్వెస్టు చేశారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు. అందుకనుగుణంగా రెవెన్యూ డిపార్టుమెంటులో కదలికలు మొదలయ్యాయి. వివిధ విభాగాల మధ్య ఆ ఫైల్ సర్క్యులేషన్‌లో ఉన్నది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడమే తరువాయి. కొత్త ప్రభాకర్‌రెడ్డి కోరికకు అనుకూలంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడంతో.. ఇకపైన రాజకీయంగా రిటర్న్ గిఫ్టుగా ఎలాంటి పరిణామం చోటుచేసుకుంటుందన్నది కీలకంగా మారింది.
చిరకాల డిమాండ్
దుబ్బాకను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని ఆ ప్రాంత ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. జిల్లాల పునర్విభజన సమయంలో రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని దివంగత మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ఆ తరువాత మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం అప్పటి ప్రభుత్వంపై పోరాటం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి ఇదే అంశాన్ని ప్రధానంగా తన ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు. ఫలితాలు వచ్చిన వెంటనే దుబ్బాకను రెవెన్యూ డివిజిన్ గా ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడంతో ప్రభాకర్ రెడ్డి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చేందుకు రెడీ అయింది.
ఎమ్మెల్యేల విజ్ఞప్తులపై సానుకూలం
నియోజకవర్గాల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశామంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి సహా మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఇటీవల క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలతో సంబంధం లేదని నొక్కిచెప్పారు. దీనికి తగినట్లుగానే సీఎం రేవంత్ సైతం.. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ కలవడానికి వచ్చినా అవకాశం ఇస్తానంటూ వ్యాఖ్యానించారు. చాలామంది బీఆర్ఎస్ లీడర్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారంటూ వార్తలు వస్తున్న సమయంలో ఆ నలుగురు, ఆ తర్వాత మరికొందరు వెళ్లి సీఎం రేవంత్‌ను కలిశారు. దానికి కొనసాగింపుగా వారి విజ్ఞప్తులకు ప్రభుత్వపరంగా సానుకూల స్పందనలు రావడం గమనార్హం.
త్వరలో మరింత మంది క్యూ
విపక్ష ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని అభివృద్ధి పనుల కోసం ఎప్పుడైనా కలవొచ్చని, సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ గానే ప్రకటించారు. దీంతో సీఎంను కలిస్తే పనులు పూర్తవుతాయనే ధీమా విపక్ష ఎమ్మెల్యేల్లో మెల్లమెల్లగా కలుగుతున్నది. దుబ్బాకను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించేందుకు కసరత్తు జరుగుతున్న విషయం బీఆర్ఎస్ లోని ఇతర ఎమ్మెల్యేల చెవిలో పడింది. దీంతో తమకు కూడా సీఎం అపాయింట్మెంట్ కావాలని, సీఎంఓ ఆఫీసును సంప్రదిస్తున్నట్టు తెలుస్తున్నది.
దుబ్బాక డివిజన్ లోకి వచ్చే మండలాలు
నియోజవర్గంలోని దుబ్బాక, మిర్ దొడ్డి, తోగుట, దౌలతాబాద్, రాయపోలు మండలాలను కలిపి రెవెన్యూ డివిజన్ గా ప్రకటించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. సీఎం ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ అధికారులు ఫైల్ ప్రాసెస్ చేసినట్టు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపు రెవెన్యూ డివిజన్ ను ప్రకటించే చాన్స్ ఉన్నట్టు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.