ఏపీపై CM KCR Focus.. ప్రజాభిప్రాయం కోసం సర్వే!
ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్‌ను విస్తరించేందుకు సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. పలువురు లీడర్లకు ఫోన్ చేసి పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నారు.
దిశ,తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్‌ను విస్తరించేందుకు సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. పలువురు లీడర్లకు ఫోన్ చేసి పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నారు. అంతే కాకుండా అక్కడి ప్రజలు బీఆర్ఎస్ గురించి ఏం అనుకుంటున్నారో తెలుసుకునే పనిలో పడ్డారు. దీని కోసం ఏపీలో పలు సర్వేలు చేయిస్తున్నారు. బీఆర్ఎస్ గురించి ఏం అనుకుంటున్నారు? కేసీఆర్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? గతంలో ఆయన చేసిన వివాదాస్పద కామెంట్స్‌ను మరిచిపోయారా? బీసీ, ఎస్సీల స్పందన ఎలా ఉంది? అనే విషయాలపై ఆ సంస్థలు సర్వేలు చేస్తున్నాయి.
వివాదాస్పద కామెంట్స్ పై ఏం అనుకుంటున్నారు?
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఏపీ ప్రజలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 'బిర్యాని అంటే వారికి తెలియదని, ఉలువ చారును తెలంగాణలో పశువులకు వాడుతారని, లంకలో పుట్టినోళ్లు రాక్షసులు అన్నట్టుగానే..ఏపీ ప్రజలంతా తెలంగాణ వ్యతిరేకులే' అని కేసీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యల గురించి ఇప్పుడు అక్కడి ప్రజలు ఏం అనుకుంటున్నారు? వారికి అవి ఇంకా గుర్తున్నాయా ? ఈ తరం యూత్ స్పందన ఏంటీ ? అనే కోణంలో ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నట్టు సమాచారం.
మూడు ప్రాంతాల్లో సర్వేలు
ప్రజల అభిప్రాయం కోసం కేసీఆర్ రాయలసీమ, ఉత్తరాంధ్ర, అమరావతి చుట్టు పక్కల జిల్లాల్లో సర్వేలు చేయిస్తున్నారు. ప్రధానంగా ఎస్సీ, బీసీ ప్రజల నుంచి ఒపీనియన్స్ సేకరిస్తున్నట్టు తెలిసింది. రెడ్లు జగన్ పార్టీకి, కమ్మ సామాజిక వర్గం టీడీపీని కాదని ఇతర పార్టీలకు ఓటు వేసే చాన్స్ లేదు. అందుకే కేసీఆర్ బీసీ, ఎస్సీ సామాజిక వర్గంపై ఫోకస్ పెట్టినట్టు గులాబీ లీడర్లు చెబుతున్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన లీడర్లనే బీఆర్ఎస్‌లో చేర్చుకునేలా ప్లాన్ చేస్తున్నారు.
అమరావతి పరిసర ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత
సర్వే జరుపుతున్న సంస్థలకు భిన్నమైన ఫీడ్ బ్యాక్ వస్తున్నట్టు తెలిసింది. కేసీఆర్ పేరు ఎత్తితే అమరావతి చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది. కేసీఆర్ తీరుతోనే తాము తీవ్రంగా నష్ట పోయామని వారు చెబుతున్నట్టు సమాచారం. అయితే ఉత్తరాంధ్రకు చెందిన బీసీ, ఎస్సీ ప్రజలు, ఉభయగోదావరి జిల్లాల్లో కేసీఆర్ పట్ల కాస్త సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది.
ఏపీలో ఎంట్రీ సభ ఎలా?
ఏపీలో కేసీఆర్ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఎప్పుడు నిర్వహించాలి? ఎక్కడ నిర్వహించాలి? అనే అంశాలపై బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌తో కేసీఆర్ ఎప్పటికప్పుడూ మాట్లాడుతున్నట్టు తెలిసింది. ఏపీ ప్రజల నుంచి బీఆర్ఎస్ స్పందన సానుకూలంగా ఉన్న ప్రాంతాల్లోనే సభ నిర్వహించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత సభ నిర్వహించే ప్రాంతం ఫైనల్ అవుతుందని సమాచారం.
Also Read...