ధరణి అద్భుతం అంటూ సీఎం వ్యాఖ్యలు.. గ్రౌండ్‌ రియాల్టీలో సీన్ రివర్స్‌

‘రిజిస్ట్రేషన్ ఆఫీసుకు పొద్దుగాల పోయి మధ్యాహ్నానికి వచ్చేస్తున్నం.

Update: 2023-06-08 04:37 GMT

 ‘రిజిస్ట్రేషన్ ఆఫీసుకు పొద్దుగాల పోయి మధ్యాహ్నానికి వచ్చేస్తున్నం. ధరణి తీసివేస్తే పైరవీకారులు మళ్లీ వస్తరు. రిజిస్ట్రేషన్, వీఆర్ఓ, వీఆర్ఏల దోపిడీ మొదలైతది. ఎట్టి పరిస్థితుల్లోనూ లంచాల పీడలేకుండా చేసిన అద్భుతమైన ధరణిని కోల్పోవద్దు. గతంలోని బాధలు మళ్లీ కొని తెచ్చుకోవద్దు. మీ బోటనవేలితో నొక్కితే తప్పా మీ రికార్డును ప్రపంచంలోని ఏ శక్తి కూడా మార్చలేరు. నీ చేతిలోకి అధికారం ఇచ్చే విధానాన్ని ఉంచుకుంటవా? పోగొట్టుకుంటవా? రైతులే ఆలోచించుకోవాలి.

- నాగర్ కర్నూలు సభలో ధరణి పోర్టల్ గురించి సీఎం కేసీఆర్.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ను రక్షించుకునేందుకు సీఎం కేసీఆర్ తాపత్రయపడుతున్నారు. తాను రూపొందించిన రెవెన్యూ వ్యవస్థ ఎంత మేలైనదో జనానికి చెప్పుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. దీన్ని రద్దు చేయాలనుకునే వాళ్లంతా వాళ్లంతా దళారీలేనంటూ కామెంట్లు చేశారు. అయితే ధరణి ద్వారా అంతా బాగైందనుకుంటే.. ఇన్ని లక్షల దరఖాస్తులు ఎందుకొచ్చాయో చెప్పాలంటూ ధరణి భూ సమస్యల వేదిక నిలదీస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో:

నాగర్ కర్నూలులో ధరణిని సీఎం కేసీఆర్ కీర్తించిన మరుసటి రోజు కూడా హైదరాబాద్లోని సీసీఎల్ఏ కార్యాలయంలో బాధిత రైతుల సందడి పెరిగింది. సీసీఎల్ఏ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ని కలిసేందుకు దరఖాస్తుదారులు క్యూ కట్టారు. తాము దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నా పరిష్కరించడం లేదంటూ ఫైళ్లు పట్టుకొని గంటల తరబడి వేచి ఉన్నారు.

ఎలక్షన్స్‌లో ప్రధాన ప్రచారాస్త్రం

అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ని రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ధరణితో రూ.వేల కోట్ల కుంభకోణం జరిగిందంటూ బీజేపీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. బీఎస్పీ, వైఎస్ఆర్టీపీలతో పాటు మిత్రపక్షాలుగా చెప్పుకుంటున్న వామపక్షాలు కూడా ధరణి పోర్టల్ లోపభూయిష్టంగా ఉందంటూ జనంలోకి వెళ్తున్నాయి. ధరణి అమల్లోకి వచ్చిన తర్వాతే ప్రతి ఊరిలోనూ భూ సమస్యలు పెరిగాయి.

ఈ విషయం ప్రతి ఎమ్మెల్యేకు తెలుసు. అందుకే వారి ప్రసంగాల్లో ఎక్కడా రెవెన్యూ వ్యవస్థ బాగుందని, ధరణి పోర్టల్ అత్యద్భుతమంటూ కీర్తించడం లేదు. కానీ సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ లు మాత్రం అంతా బాగుందని, పోతే దొరకదన్న భయాన్ని కల్పిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో భూ సమస్యలు కూడా ప్రధాన ఎజెండాగా మారనుందని అధికార, ప్రతిపక్షాల ధోరణి స్పష్టం చేస్తున్నది.

బీఆర్ఎస్ లీడర్లకు చిక్కులు

ప్రతి ఊరిలోనూ ధరణి పోర్టల్ సృష్టించిన సమస్యలకు ఇబ్బంది పడుతున్న రైతులు ఉన్నారు. ఏదో ఒక రకమైన సమస్యతో దరఖాస్తు చేసుకోవడం, నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగిన వారున్నారు. ఇంకొందరికీ పరిష్కారం దొరక్క కోర్టులను ఆశ్రయించిన వారున్నారు. ఇలాంటి అనేక సమస్యలను బాధిత రైతులు స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ లీడర్ల దృష్టికి తీసుకొచ్చారు.

ఆఖరికి ఎమ్మెల్యేలకు మొర పెట్టుకున్న వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉన్నది. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సొంత సమస్యలు పరిష్కారం కాకపోతే హైకోర్టుని ఆశ్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. రెండు సార్లు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన సందర్భాల్లోనూ సమస్యలను ఏకరువు పెట్టారు. పలువురు ఎమ్మెల్యేలే సదరు మంత్రుల దృష్టికి అనేక చిక్కుముళ్లు ఉన్నాయంటూ వివరించారు.

ఆఖరికి మంత్రివర్గ ఉపసంఘం కూడా పలు సిఫారసులు చేసిన విషయం తెలిసిందే. వాటిలో చాలా వరకు నేటికీ అమల్లోకి రాలేదు. ఇలాంటి సందర్భాల్లో సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా గ్రామాల్లో ధరణి పోర్టల్ పై అత్యద్భుతమంటూ ప్రచారం చేసే అవకాశాలు కనిపించడం లేదు. లోపభూయిష్టమైన పోర్టల్ రూపకల్పనతో సృష్టించబడిన అనేక సమస్యలకు రైతులు బలవుతున్నారు.

కోర్టుకే వెళ్లమంటే..

99 శాతం సమస్యలు పరిష్కారమైన సీఎం కేసీఆర్ వాదనతో ధరణి భూ సమస్యల వేదిక సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే నిజమైతే పెండింగులోని దరఖాస్తులెన్ని? పరిష్కరించినవి ఎన్ని? తిరస్కరించినవి ఎన్ని? కోర్టుకు వెళ్లమని చెప్పిన దరఖాస్తులు ఎన్ని? అనే లెక్కలు తీయడం ద్వారా వాస్తవాలు వెల్లడవుతాయంటున్నారు. అధికారులు సృష్టించిన సమస్యలకు రైతులను బలి చేస్తున్న ఉదంతాలు అనేకం ఉన్నాయి. పైగా మాదే తప్పు.. అయినా మేమేం చేయలేం? కోర్టుకు వెళ్లాలంటూ లిఖితపూర్వకంగా రాసిచ్చిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండా, క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేయకుండా ధరణి పోర్టల్ ని రద్దు చేయాలనే వారంతా దళారీలే అంటూ ఎదురుదాడికి దిగుతుండడం గమనార్హం. తహశీల్దార్ పరిష్కరించాల్సిన సమస్యకు రైతులు కోర్టు దాకా ఎందుకు వెళ్లాలి? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

తప్పుల అంగీకారం

– రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంఖాల్లో ఓ ఎన్ఆర్ఐకి 10 ఎకరాల భూమి ఉన్నది. ఆయన ఎప్పుడో 20 ఏండ్ల క్రితమే కొనుగోలు చేశారు. చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని వ్యవసాయం చేయిస్తున్నారు. అది ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉంటుంది. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఆ భూమిని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరిట రాసేశారు. అమెరికా నుంచే ఈ విషయాన్ని గుర్తించి తన బంధువు, రిటైర్డ్ రెవెన్యూ అధికారిని తహశీల్దార్ దగ్గరికి పంపారు.

అయితే.. మేమేం చేయలేం? ఆ కంపెనీ నుంచి మళ్లీ కొనుగోలు చేయడం తప్ప ఏం చేసేదేం లేదు అంటూ చేతులెత్తేశారు. అసలు హక్కులే లేని ఆ కంపెనీ నుంచి తామెందుకు సేల్ డీడ్ చేయించుకోవాలి? ఆ తర్వాత లీగల్ గా ఎదుర్కొనే సమస్యలకు ఎవరు సమాధానం చెబుతారు? అంటూ బాధితులు నిరాకరించారు. ఎవరు పేర్లు మార్చారో, వారే సరిదిద్దాలంటూ ఒత్తిడి చేసినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. దాంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు.

– 2020 జనవరి 28న రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నిర్దవెల్లిలో భూమి కొనుగోలు చేశారు. పట్టాదారుడి దగ్గర 3 ఎకరాలు కర్ణాటక మైసూరుకు చెందిన ఒకరు సేల్ డీడ్ చేయించుకున్నారు. ఇది ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చే కంటే ముందే జరిగింది. కొనుగోలుకు ముందు పహాణీలు చెక్ చేసుకున్నారు. కానీ మ్యుటేషన్ చేయించుకోలేదు. ఈ క్రమంలో వాళ్లు విదేశాలకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చింది. దాంతో సేల్ డీడ్ మాత్రమే మిగిలింది. పాత వాళ్లకే హక్కులు కట్టబెట్టారు. విక్రయించిన భూమిని పట్టాదారుడు వారి బంధువుల పేరిట 1.20 ఎకరాలు సేల్ డీడ్ అయ్యింది.

– వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెంలో ఓ రైతుకు 4.12 ఎకరాల భూమి ఉంది. దాంట్లో 2.06 ఎకరాలు అమ్మారు. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత మొత్తం భూమిని కొనుగోలు చేసిన రైతు పేరిట రాసేశారు. అదేమని అడిగితే తప్పయ్యిందంటూ తహశీల్దార్ రాసిచ్చారు. కానీ తామేం చేయలేం? కోర్టుకు వెళ్లాలంటున్నారు.

ధరణి పోర్టల్ లోపాల పుట్ట

-మన్నె నర్సింహారెడ్డి, ధరణి భూసమస్యల వేదిక కన్వీనర్

ధరణిని కీర్తిస్తూ.. మరోసారి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. తహశీల్దార్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బందిని తిడుతూ ప్రజలను రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారు. పహణీ నఖలు, సీసీ కాపీలు కూడా ఇవ్వలేని సిస్టం మనకు అవసరమా? రైతుబంధు, రైతు బీమా ధరణి వల్ల వస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ధరణి ఒక పెద్ద లోపాల పుట్ట. ధరణిలో ఉన్న డేటా అంతా కరెక్ట్ కాదు. దీని మీద బహిరంగ చర్చకు సిద్ధం.

Tags:    

Similar News