రియల్ 'చీట్'.. చిట్టీ డబ్బులే పెట్టుబడి
దిశ, తెలంగాణ బ్యూరో: మీరు ప్రముఖ కంపెనీలో చిట్టీ వేశారా? అవసరం ఉన్నప్పుడు డబ్బులు తీసుకోవచ్చునని భావిస్తున్నారా? చిట్టీలో చేరేముందు
దిశ, తెలంగాణ బ్యూరో: మీరు ప్రముఖ కంపెనీలో చిట్టీ వేశారా? అవసరం ఉన్నప్పుడు డబ్బులు తీసుకోవచ్చునని భావిస్తున్నారా? చిట్టీలో చేరేముందు మీరెన్ని పత్రాలపై సంతకాలు పెట్టారు? వాటిలో ఏయే షరతులున్నాయి..? ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. చిట్టీ గడువు ముగిశాక సొమ్ము తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదనుకుంటున్నారా? కానీ కొన్ని చిట్ ఫండ్ కంపెనీలు మీ సొమ్ముతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాయి. కాల పరిమితి ముగిసినా డబ్బులు ఇవ్వకుండా ప్లాట్లు అంటగడుతున్నాయి. అదేదో హైదరాబాద్ శివార్లలో అనుకుంటే పొరపాటే. రాష్ట్ర రాజధానికి 250 కి.మీ. దూరంలో మారుమూల ప్రాంతంలో ఇంటి జాగాల కొనుగోలుకు అడ్వాన్సుగా ఇచ్చినట్లుగా రశీదులు ఇస్తున్నాయి. డబ్బులు తిరిగివ్వవకుండా డిపాజిట్ల పేరిట రశీదులు ఇస్తున్నాయి. మీకు ఇవ్వాల్సిన డబ్బులను ప్లాట్ల కొనుగోలుకు అడ్వాన్స్ గా ఇచ్చినట్టు రాసేసుకుంటున్నారు. ఎంవోయూ సర్టిఫికేట్లుగా ఇస్తున్నారు. చిట్స్ మెచ్యూరిటీ దాటి నెలలు గడుస్తున్నా పైసలివ్వడం లేదు. ఇలా వేలాది మంది బాధితులు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నగరాల్లో ఉన్నారు. ఇలా చేస్తున్నది చిన్న కంపెనీలేం కాదు. సదరు కంపెనీల్లో రాజకీయ నాయకులు, వారి అనుయాయులు భాగస్వాములుగా ఉండడంతో కస్టమర్ల బాధలు పట్టించుకునే వారే కరువయ్యారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్పట్టణాల్లోని పలు చిట్‌ఫండ్ కంపెనీలు రియల్ఎస్టేట్సంస్థలుగా అవతారమెత్తాయి. ప్రాపర్టీ డెవలపర్స్ గా పేరు మార్చుకుంటున్నాయి.
ప్లాట్ల కొనుగోలుకు అడ్వాన్స్
ప్రముఖ టీవీ చానళ్లల్లో విరివిగా అడ్వర్టయిజ్మెంట్ ఇచ్చే వరంగల్ లోని ఓ కంపెనీ కూడా రియల్ ఎస్టేట్ సంస్థగా మారింది. వారి చిట్ ఫండ్ కంపెనీలోని వినియోగదారులకు చిట్టీ కాలపరిమితి ముగిసినా డబ్బులు ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారు. ఎవరైనా బలవంతం చేస్తే అడ్వాన్స్ పేమెంట్లతో కూడిన సర్టిఫికేట్లను చేతిలో పెడుతున్నారు. అవిభాజ్యపు ప్లాటు(అన్ డివైడెడ్షేర్ ఇన్ ప్లాట్) లో 20 గజాల నుంచి 100 గజాల వరకు అంటూ అడ్వాన్స్ పర్చేజ్ అని రికార్డులు రూపొందిస్తున్నారు. అందులో ప్లాటు నంబరు మాత్రమే వేస్తారు. ఆఖరున ఆ షెడ్యూల్ ఏ సర్వే నంబరులో ఉన్నదో చెబుతారు. కానీ ప్లాటుకు సంబంధించిన స్పెసిఫికేషన్లు, లే అవుట్ కాపీలు క్లయింట్లకు ఇవ్వడం లేదు. కానీ మెమోరండాం ఆఫ్ అండర్ స్టాండింగ్(ఎంవోయూ) పేరిట స్టాంపులు అతికించి సంతకాలు చేయించుకుంటున్నారు. నిజానికి వినియోగదారుడు తాను ఎత్తిన చిట్టీ డబ్బులకు సంబంధించిన పత్రాలపై సంతకాలు తీసుకుంటున్నారని భావిస్తున్నారు. కంపెనీ సిబ్బంది చిట్టీ డబ్బులకు ప్లాటు స్థలాన్ని అంటగడుతున్నట్లు చెప్పడం లేదు. ఇటీవల ఓ కంపెనీ హైదరాబాద్ ఉప్పల్ప్రాంతానికి చెందిన కస్టమర్ భూపాలపల్లి జిల్లా కొంపల్లిలోని ఓ సర్వే నంబరులో ప్లాట్లు ఉన్నాయని, అందులోని ఓ ప్లాటుకు అన్ డివైడెడ్ షేర్ ఇస్తూ ఎంవోయూ రాయించుకున్నది. అది హైదరాబాద్ నుంచి 250 కి.మీ. దూరంలో ఉంది. అక్కడ ఎలాంటి వెంచర్ లేదు.
వివాదాస్పద భూములే
ఓ ప్రముఖ రియల్ఎస్టేట్ కంపెనీ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం రామాయపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కొంపల్లిలో వేసిన వెంచర్ లోని ప్లాట్లను అంటగడుతున్నది. అక్కడ ఐటెం–1, 2, 3 లో విస్తీర్ణాన్ని చూపిస్తున్నారు. రికార్డుల్లో చూపించే ప్లాటుకు సంబంధించిన సరిహద్దులకు బదులుగా ఐటెం విస్తీర్ణానికి హద్దులను పేర్కొన్నారు. దీన్ని బట్టి వారికి ఇస్తామనే ప్లాటు ఎక్కడ ఉన్నదో గుర్తించడం అసాధ్యం. ధరణిలో సదరు భూమి క్లియర్ గా లేకపోవడం గమనార్హం. 193/1 లో 0.06 ఎకరాలు, 193/2లో 0.02 లో, 193/ అ లో 0.21 ఎకరాలు, 194 /అ/1లో 0.08 ఎకరాలు, 193/అ/2లో 0.08 ఎకరాలుగా ఉంది. వీటికి పట్టాదారు పాసు పుస్తకాలు కూడా జారీ చేయలేదు. అలాగే రికార్డుల్లో 193/ఆ లో 8.38 ఎకరాలు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ పేరిట ఉంది. 196 లో 16.34 ఎకరాలు, 197లో 11.08 ఎకరాలుగా ఉన్నది. కానీ పాసు పుస్తకం జారీ చేయలేదు. 193/3 లో పట్టాదారు పేరు, తండ్రి పేరు శ్రీ గా పేర్కొన్నారు. దీంట్లో విస్తీర్ణం 5.06 ఎకరాలుగా నమోదు చేశారు. వ్యవసాయ భూమిగానే ఉన్నది. కానీ ఎంవోయూలో చూపించిన వివరాలను ధరణి పోర్టల్‌లో వెతికితే పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
తెల్ల కాగితాలపై సంతకాలు
పేరుగాంచిన చిట్ ఫండ్ కంపెనీలు వినియోగదారుల చేత తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకుంటున్నాయి. పలు కారణాలు చెబుతూ సంతకాలు చేయించుకొని వారికి అనుకూలంగా టైప్ చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు స్టాంప్స్ అండ్రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ కు కూడా పలువురు బాధితులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన ఉదంతాలు ఉన్నాయి. వరంగల్ కేంద్రంగా ప్రఖ్యాత చిట్ ఫండ్ కంపెనీ తనతో తెల్లకాగితంపై సంతకాలు చేయించుకున్నారని, తమకు రావాల్సిన అమౌంట్ ను మరొకరికి ఇవ్వాలని చెప్పినట్లుగా రాసుకున్నారు. తమకు ష్యూరిటీ కింద సంతకం చేసిన వారికి డబ్బులు ఇచ్చేయ్యాలంటూ తాము చెప్పినట్లు పత్రాలను సృష్టించి మోసం చేసినట్లు వరంగల్‌కు చెందిన గట్ట రవీందర్ అనే వ్యక్తి కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. కొన్నేండ్లుగా వరంగల్కేంద్రంగా నడుస్తోన్న కొన్ని చిట్ ఫండ్ కంపెనీలపై అనేక ఆధారాలతో ఫిర్యాదులు చేశారు. రాజకీయ అండదండలు కలిగిన సదరు కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిసింది. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ లలో సాగుతున్న ఈ దందాపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.