Delhi: అది యావత్ తెలంగాణ కోరిక.. కేంద్రమంత్రికి గుర్తుచేసిన సీఎం రేవంత్
కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ(Railway Coach Factory) నెలకొల్పాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnav)కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) విజ్ఞప్తి చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ(Railway Coach Factory) నెలకొల్పాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnav)కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ(Kazipet Coach Factory) ఏర్పాటును పేర్కొన్న విషయాన్ని కేంద్ర మంత్రికి సీఎం గుర్తు చేశారు. కాజీపేటలో పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ (పీవోహెచ్) వర్క్‌షాప్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఆ తర్వాత సైతం కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోరుతూ తాను లేఖ రాశానని సీఎం వివరించారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అనేది కాజీపేట వాసుల కల మాత్రమే కాదని.. యావత్ తెలంగాణ స్వప్నమని సీఎం కేంద్ర మంత్రికి వివరించారు.
వికారాబాద్-కృష్ణా స్టేషన్ మధ్య పూర్తిగా రైల్వే శాఖ వ్యయంతో నూతన రైలు మార్గం నిర్మించాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈ మార్గం నిర్మిస్తే దక్షిణ తెలంగాణలో మారుమూలన వెనుకబడి ఉన్న పరిగి, కొడంగల్, చిట్లపల్లె, టేకల్ కోడ్, రావులపల్లి, మాటూరు, దౌల్తాబాద్, దామరగిద్ద, నారాయణపేట్, మక్తల్ అభివృద్ధి చెందడంతో పాటు తాండూర్ సమీపంలోని సిమెంట్ క్లస్టర్, ఇతర పరిశ్రమలు అభివృద్దికి అవకాశం ఉంటుందని వివరించారు. ఈ మార్గంతో వికారాబాద్ జంక్షన్ నుంచి కృష్ణా స్టేషన్ల మధ్య 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని తెలిపారు. కల్వకుర్తి-మాచర్ల మధ్య నూతన రైలు మార్గం మంజూరు చేయాలని రైల్వే శాఖ మంత్రిని సీఎం కోరారు. కల్వకుర్తి నుంచి వంగూరు-కందుకూరు-దేవరకొండ-చలకుర్తి-తిరుమలగిరి మీదుగా మాచర్ల వరకు తాము ప్రతిపాదించే నూతన మార్గం ప్రతిపాదిత గద్వాల-డోర్నకల్, ఇప్పటికే ఉన్న మాచర్ల మార్గాలను అనుసంధానిస్తుందని సీఎం వివరించారు. ఈ మార్గం నిర్మిస్తే సిమెంట్ పరిశ్రమలతో పాటు అటవీ ఉత్పత్తుల విక్రయానికి ప్రయోజనం కలుగుతుందని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. ఈ మార్గంతో సికింద్రాబాద్, గుంటూరు, డోన్ సెక్షన్ల మధ్య అనుసంధానత కలిగి శ్రీశైలం వెళ్లే భక్తుల సులభతర ప్రయాణానికి అవకాశం కల్పిస్తుందని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు.
డోర్నకల్-మిర్యాలగూడ (పాపటపల్లి-జాన్ పహాడ్), డోర్నకల్-గద్వాల ప్రతిపాదిత రైలు మార్గాలను పునఃపరిశీలించాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ రెండు రైలు మార్గాలు ఖమ్మం జిల్లాలోని సారవంతమైన భూములు, చెరకు పరిశ్రమలు, గ్రానైట్ పరిశ్రమలు, సైబరియన్ వలస పక్షుల కేంద్రం, భారతదేశంలోని అతి పెద్ద బౌద్ధ స్తూపం, పాలేరు రిక్రియేషన్ ప్రాంతాల మీదుగా ఉన్నాయని సీఎం తెలిపారు. పాలేరు శాసనసభ నియోజకవర్గంలోని ఈ ప్రాంతంలో భూముల ధరలు భారీగా ఉన్నాయని, అత్యధికులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన రైతులేనని సీఎం వివరించారు. ఇక్కడ విలువైన భూముల సేకరణ రైల్వే శాఖకు భారంగా మారుతుందని.. ఆ ప్రతిపాదిత మార్గాలను మార్చి డోర్నకల్ నుంచి వెన్నారం-మన్నెగూడెం-అబ్బాయిపాలెం-మరిపెడ మీదుగా మోతె వరకు రైల్వే లైన్లను మార్చాలని సీఎం కోరారు. ఈ ప్రాంతాలు పూర్తిగా వెనుకబడి ఉన్నాయని.. రైలు మార్గాలు కూడా లేవని తెలిపారు. పైగా గతంలోని మార్గాలతో పోలిస్తే 19 కి.మీ. దూరం తగ్గుతుందని సీఎం వివరించారు. ఈ రెండు మార్గాల అలైన్‌మెంట్‌ను పునఃపరిశీలించాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీలు డాక్టర్ కడియం కావ్య, డాక్టర్ మల్లు రవి, కుందూరు రఘువీర్ రెడ్డి, సురేశ్ షెట్కార్, గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎం.అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.