'Dharani 'లో పేర్ల మార్పిడికి బాధ్యులెవరు.. ఆందోళనలో అన్నదాతలు!
గతంలో ఏదైనా పట్టాదారు, యాజమాన్య హక్కుల సమస్యలు వస్తే రైతులు రెవెన్యూ అధికారులను సంప్రదించేవారు. వీఆర్వో, గిర్దావర్, తహశీల్దార్
దిశ, తెలంగాణ బ్యూరో: గతంలో ఏదైనా పట్టాదారు, యాజమాన్య హక్కుల సమస్యలు వస్తే రైతులు రెవెన్యూ అధికారులను సంప్రదించేవారు. వీఆర్వో, గిర్దావర్, తహశీల్దార్.. సమస్య తీవ్రతను బట్టి ఆర్డీవో, జాయింట్ కలెక్టర్.. ఆఖరికి కలెక్టర్ వరకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు డాటా అంతా ఫ్రీజింగ్ చేసి కలెక్టర్, సీసీఎల్ఏ స్థాయిలోనే కేంద్రీకృతం చేశారు. సమస్యలు పరిష్కరిస్తామంటూ 33 మాడ్యూళ్లను అందుబాటులోకి తేచ్చారు. ఆ మాడ్యుళ్లలో ఏ ఆప్షన్ కింద అర్జీ చేసుకోవాలో రైతులకు తెలియడం లేదు. అంతేకాకుండా ప్రతి అర్జీకి రూ.1000 రుసుం విధించడం, కారణాలు చెప్పకుండా తిరస్కరిస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు.
డబ్బుల్లేకుండా పట్టా..
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడ రెవెన్యూ శివారు స. నం.70/సీ లో 2.18 ఎకరాల పట్టా భూమి శ్యామల వెంకట్ రెడ్డి అనే రైతుకి వారసత్వంగా వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలోనే పట్టా జారీ అయ్యింది. ఎల్ఆర్ యూపీ సమయంలో రెవెన్యూ శాఖ ద్వారా తొలి విడత పీపీబీల పంపిణీలో యథాతథంగా పీపీబీ నం.T22090080040తో 2018 ఏప్రిల్ 18న తహశీల్దార్ డిజిటల్ సంతకం చేసిన కొత్త పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ కూడా అందించారు. రైతుబంధు కూడా వస్తున్నది. ఇటీవల పీపీబీ నకల్ డౌన్ లోడ్ చేయడానికి ప్రయత్నించగా.. దానిలో పక్క గ్రామానికి చెందిన రైతు గర్దాసు వేణుగోపాల్ పేరు కనిపించింది. ఫోటో, ఆధార్ నంబర్ తనవే ఉండటం గమనార్హం. కానీ రియల్ టైమ్ డేటాగా చెప్పుకునే ధరణిలో డిజిటల్ సంతకం కాస్తా 29 మార్చి 2018 నాడు చేసినట్టు ఉండటం ఆశ్చర్యకరం. 'ముందుగా నాకు జారీ చేసిన పీపీబీలో లేటెస్ట్ తేదీ ఉండటం. రియల్ టైమ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగించే ధరణిలో మాత్రం అంతకు పూర్వం తేదీ ఉండటం ఏమిటి? ఇప్పుడు ఆ మార్పిడి ఎలా జరిగిందో తెలిపే సమాచారం ఎక్కడ లభిస్తుంది?' అనేది తెలియక ఆ రైతు ఇబ్బంది పడుతున్నాడు.
ఖరీదైన ఏరియాల్లోనే మరి..
ఒకరి భూమి మరొకరి పేరిట రాసే ఘటనలు ఖరీదైన ఏరియాల్లోనే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, శంకర్ పల్లి ఏరియాల్లో దర్శనమిచ్చాయి. తాజాగా వరంగల్ జిల్లాకూ పాకాయి. మహేశ్వరం మండలంలో ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న ఓ ఎన్ఆర్ఐకి చెందిన 8 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీ పేరిట రాసేశారు. దీంతో పట్టాదారుడు అమెరికా నుంచి వచ్చి అధికారులను నిలదీస్తే.. కంపెనీ నుంచి తిరిగి కొనుగోలు చేసినట్లు సేల్ డీడ్ చేయించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ఇలా చేస్తే లీగల్ ఇష్యూస్ వస్తాయని గుర్తించిన పట్టాదారుడు హైకోర్టును ఆశ్రయించి న్యాయం పొందారు. ప్రతి ఒక్కరూ తమ భూముల వివరాల డేటా చెక్ చేసుకుంటే బయటపడే అవకాశాలు ఉన్నాయి.
మార్పిడి ఎలా?
ధరణి పోర్టల్ అమలుకు ముందే కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు కూడా అందాయి. ఆధార్ నంబర్ కూడా సీడ్ చేశారు. మరి ఉన్నట్టుండి పేర్లు ఎలా మారుతున్నాయి? ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్నారా? ఏ సాంకేతిక నైపుణ్యం వారితో చేయిస్తున్నది? మరి రైతులకే తెలియకుండా మరొకరి పేరిట పట్టా చేయగల ధరణి పోర్టల్ సాంకేతిక నైపుణ్యం ద్వారా భూ రికార్డులు పదిలమేనా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఏ డాక్యుమెంట్ల ఆధారంగా పట్టా మార్పిడి చేస్తున్నారో కూడా చెప్పలేని దుస్థితిలో అధికారులు ఉన్నారు. అంతా ఆన్ లైన్.. తామేం చేయలేమంటూ చేతులెత్తేస్తున్న ఉదంతాలూ ఉన్నాయి. ధరణి పోర్టల్ వల్ల ఏర్పడుతున్న సమస్యలు చూస్తుంటే భవిష్యత్తులో ఎవరి భూములు ఎవరి పేరిట మారుతాయోనన్న అనుమానాలు కలుగుతున్నాయి.
Also Read...
BRS రెండు నాల్కల ధోరణి.. కన్‌ఫ్యూజన్‌లో గులాబీ రాష్ట్ర నాయకులు!