‘సిట్’ విచారణకు బండి సంజయ్ దూరం.. కారణం ఇదే?

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లేకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జారీ చేసిన నోటీసుకు అనుగుణంగా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ శుక్రవారం విచారణకు హాజరయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

Update: 2023-03-23 23:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లేకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జారీ చేసిన నోటీసుకు అనుగుణంగా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ శుక్రవారం విచారణకు హాజరయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. పార్లమెంటు సమావేశాల దృష్ట్యా ఢిల్లీలోనే ఉండిపోవాల్సి వస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కీలకమైన బిల్లులపై చర్చ జరుగుతున్నందున సభ్యులంతా హాజరుకావాల్సిందిగా పార్టీ అగ్రనాయకత్వం విప్ జారీ చేయడంతో ఆయన అక్కడే ఉండిపోవాల్సి వస్తున్నదని ఆ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ఇప్పటివరకు తనకు సిట్ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని ఢిల్లీలో మీడియాతో బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సిట్ నుంచి మరికొంత సమయం అడుగుతారా లేక అందుబాటులో ఉన్న సమాచారాన్ని ప్రతినిధి ద్వారా పంపుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.

పేపర్ లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ కార్యాలయం, పేషీపైన బండి సంజయ్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ‘సిట్’పై నమ్మకం లేదని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని గతంలో డిమాండ్ చేశారు. ఇదే వ్యవహారంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి సైతం సిట్ నోటీసులు జారీచేసింది. అందులో భాగంగా గురువారం విచారణకు హాజరయ్యారు. బండి సంజయ్ కూడా హజరుకావడం అనివార్యమైంది. అయితే శుక్రవారం హాజరయ్యే సమయానికి సిట్ అధికారులకు బండి సంజయ్ ఎలాంటి సమాధానం చెప్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ లేఖ రాసినట్లయితే అందులో ఏం పేర్కొంటారన్నది గమనార్హం. సిట్ దర్యాప్తు ఎక్కడివరకు వచ్చిందో లేటెస్ట్ స్టేటస్ రిపోర్టు ఇవ్వాల్సిందిగా సిట్ చీఫ్‌కు గవర్నర్ లేఖ రాయడంతో బండి సంజయ్ విచారణ కీలకంగా మారింది.

ఇదిలా ఉండగా పేపర్ లీకేజీ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బీజేపీ నిరుద్యోగ దీక్ష పేరుతో ధర్నా చౌక్‌లో శనివారం భారీ బహిరంగసభను నిర్వహించనున్నది. ఇప్పటికే పోలీసులకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నది. గురువారం రాత్రి వరకూ పోలీసుల నుంచి ఈ దీక్ష (బహిరంగసభ)కు అనుమతి రాలేదు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని, చివరి నిమిషం వరకూ టెన్షన్ పెడతారనే అనుమానాన్ని బీజేపీ నాయకులు వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి: బ్రేకింగ్ : సిట్‌కు బండి సంజయ్ లేఖ.. ఆ విషయంలో క్లారిటీ!

Tags:    

Similar News

టైగర్స్ @ 42..